ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూసులు తీసుకుంటున్నారా? ఈ నిజాలు తెలుసా?
posted on Aug 11, 2025 @ 9:30AM
శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు. ఈ డీటాక్స్ జ్యూస్లు లేదా పానీయాలు ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన కాలేయ సమస్యలను నయం చేయగలవని నమ్ముతారు. ఈ కారణంగానే డిటాక్స్ పానీయాలకు చాలా ఆదరణ ఉంది. కొందరైతే రోజు మొత్తం డిటాక్స్ నీటినే తాగుతూ ఉంటారు. సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల డీటాక్స్ నీటిని లేదా పానీయాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. కానీ ఈ డిటాక్స్ జ్యూసుల గురించి దిమ్మతిరిగే నిజాలను వెలిబుచ్చుతున్నారు వైద్యులు. దీని గురించి తెలుసుకుంటే..
డిటాక్స్ జ్యూస్లు కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో లేదా నయం చేయడంలో పెద్దగా సహాయపడవట. బయట అమ్మే డిటాక్స్ జ్యూస్లు లేదా హెర్బల్ డ్రింక్స్ తయారీలో ఉపయోగించే పదార్థాలు, వాటి కూర్పు గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ఈ ద్రవాలలో కాలేయానికి హానికరమైన భారీ లోహాలు లేదా ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
డీటాక్స్ పానీయాలు కొవ్వు కాలేయ సమస్యలను పెంచుతాయి..
నిజానికి ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కాలేయ సమస్య మరింత దిగజారిపోతుందట. ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి క్రానిక్ లివర్ డిసీజ్, క్రానిక్ లివర్ డిసీజ్ నుండి ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ మారవచ్చట. కాబట్టి ఈ జ్యూస్లను తీసుకోకుండా ఉండటం మంచిది.
కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏం తినాలి..
కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా కాలేయ సమస్యలను నయం చేయడానికి డీటాక్స్ జ్యూస్లను ఆశ్రయించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను అనుసరించడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు.
ఆరోగ్యకరమైన, పోషకమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. ప్రాసెస్ చేసిన, కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడాన్ని నివారించడం, తరచుగా బయట తినడాన్ని నిషేధించడం చేయాలి. వీటికి బదులు ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోవాలి. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి. లేదా వీటిని పరిమితం చేయాలి. మాంసాహారం తినాలని ఉంటే లీన్ మాంసాలను ఎంచుకోవడం ఉత్తమమట.
ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి..
ధూమపానం, అధికంగా మద్యం సేవించడం వంటి అలవాట్లను నివారించడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఈ ప్రమాద కారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.
కాలేయానికి నిజమైన 'డిటాక్స్' అంటే శుభ్రమైన, పోషకమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా. రోజువారీ ఎంపికలలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూస్లపై ఆధారపడటానికి బదులుగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరింత ప్రభావవంతమైన, సురక్షితమైన విధానం.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...