పోలవరం, నర్సాపురం ఫలితాలపై కాంగ్రెస్ ధీమా
posted on Mar 7, 2012 9:04AM
పశ్చిమగోదావరి జిల్లా: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, నర్సాపురం ఎమ్మెల్యేలు జగన్ పక్షాన చేరి కాంగ్రెస్ విప్ ను ధిక్కరించడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికలపై వ్యూహాత్మకంగా ఇప్పటిదాకా వ్యవహరించిన కాంగ్రెస్ ఇప్పుడు జగన్ పార్టీ కేడర్ ను తనవైపు తిప్పుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. నర్సాపురం నియోజకవర్గ వ్యవహారాలను మంత్రి పితాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత 5 నెలలుగా ఆయన స్థానిక ఎమ్మెల్యే జగన్ వర్గ నాయకుడు అయిన ముదునూరి ప్రసాదరాజుకు ఏ క్రెడిట్ ను దక్కకుండా జాగ్రత్త వహించారు. జగన్ వర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులకుగాని, కార్యకర్తలకుగాని ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి లబ్ది దక్కకుండా చేయగలిగాడు. దీంతో ఆ నాయకులు నీరుగారిపోయి చాలావరకు మంత్రికి దాసోహం అన్నారు. దీనికితోడు అధికార యంత్రాంగం కూడా ముదునూరి ప్రసాదరాజుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సామాన్య జనంలో ఆయన పలుకుబడి పలుచబడి పోయింది. పోలవరం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని వుంది. ఒకానొకదశలో తనను ఎమ్మెల్యేగా ఎవరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాలరాజు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు జిల్లా డిసిసిబి ఛైర్మన్ కరాటం రాంబాబు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో ఎక్కువభాగం కాంగ్రెస్ కేడర్ కు దక్కాలా చేయడంలో ఆయన సఫలమయ్యారు. ఇకనుంచి ఆయన గ్రామాల వారీగా జగన్ సానుభూతిపరులను ఒప్పించి వారిని తనువైపు తిప్పుకోవడానికి దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా నర్సాపురం, పోలవరం నియోజకవర్గాల్లో జగన్ ఓదార్పు యాత్రలకు జనం తండోప తండాలుగా వచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు మాత్రం సానుకూలంగా వుండే వాతావరణం కనిపించడంలేదు.