నర్సన్నపేటలో సోదరుల మధ్య సంకుల సమరం
posted on Mar 7, 2012 8:53AM
శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ధర్మాన సోదరుల మధ్య సంకుల సమరం ప్రారంభమైంది. నర్సన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉపఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాసు మళ్ళీ పోటీచేయడం ఖాయం. ఇది అతని సోదరుడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాద్ కు సంకటంగానే మారింది. ధర్మాన కుటుంబంలో సోదరుల మధ్య జరుగబోతున్న ఈ పోటీ ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు. తన సోదరుడు కృష్ణప్రసద్ కు ప్రత్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దింపినా వారిని గెలిపించుకునే బాధ్యత మాత్రం ధర్మాన ప్రసాద్ దే అవుతుంది. మంత్రి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తన సోదరుడు కృష్ణదాసుపై పోటీకి మరో సోదరుడు ధర్మాన రామదాసు లేదా ఆయన భార్య రమాదేవిని రంగంలోకి దింపాలనుకుంటున్నారు. తన సోదరుడిని ఓడిస్తేనే రాష్ట్రస్థాయిలో మంత్రి ధర్మాన ప్రతిష్ట పెరుగుతోంది. లేకుంటే పరువు పోతుందని ఆయన భయపడుతున్నట్లు తెలిసింది.