మంత్రి గా, గంటాపై కాంగ్రెస్ కార్యకర్తల నిప్పులు
posted on Mar 7, 2012 9:10AM
హైదరాబాద్: పిఆర్పీనుంచి శాసనసభ్యుడుగా ఎన్నికై ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమయిన తరువాత మంత్రి పదవిని బహుమతిగా పొందిన గంటా శ్రీనివాసరావుపై విశాఖజిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిప్పులు చెరుగుతున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా గంటాను విమర్శిస్తున్నారు. ఎప్పటినుంచో పార్టీ అభివృద్ధికి కృషిచేస్తున్న తమను విస్మరించి వలస పక్షిలాంటి గంటాకు మంత్రి పదవి ఇవ్వటం ఏమిటంటూ అక్కను వెళ్ళగక్కుతున్నారు. అంతేకాక గంటా శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రత్యూష కన్ స్ట్రక్షన్ కంపెనీ అనేక అక్రమాలకు పాల్పడుతున్నదంటూ ఆరోపణ చేస్తున్నారు. ఈ అసంతృప్తి, ఆరోపణలో గంటా శ్రీనివాసరావు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన ఒక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే మంత్రిపై విరుచుకుపడ్డారు. నిన్నగాక మొన్నవచ్చిన పిఆర్పీ కార్యకర్తలకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. దీనికి తోడు గంటా శ్రీనివాసరావుకు నియోజకవర్గంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు రఘునాద్ కు మధ్య ఎప్పటినుంచో వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ గంటాకు తలనొప్పిగా మారాయి.