ఆలా చేస్తే ఆర్కేకు దళితరత్న బిరుదు..
posted on Mar 18, 2021 @ 6:31PM
ఏపీ రాజధాని అమరావతిలో దళితుల అస్సైన్డ్ భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వం బలవంతంగా లాక్కుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేయగా టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు సీఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఈ వ్యవహారంపై ఏపీలో తీవ్ర రాజకీయ రచ్చ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేత మాజీ మంత్రి కెఎస్ జవహర్ స్పందిస్తూ... ఏపీలో చట్టం ఫ్యాక్షన్ పాలకుల చేతిలో బందీ అయిందని... దళిత హక్కులు ప్రస్తుతం దళారుల చేతిల్లోకి వెళ్లిపోయాయని ఆరోపించారు.
ఎమ్మెల్యే ఆర్కేకు దళితులపై నిజంగా ప్రేమ వుంటే వైఎస్ఆర్ కుటుంబం.. ఇడుపులపాయలో ఆక్రమించిన అసైన్డ్ భూములు నిరుపేదలకే తిరిగి ఇప్పించాలని.. అదేవిధంగా శిరోముండనం ఘటనపై ఆళ్ళ కేసు వేస్తే ఆయనకు దళిత రత్న బిరుదు ప్రదానం చేస్తామని అన్నారు. అయితే ఇలా చేయడం ఎమ్మెల్యే ఆళ్ల వల్ల కాదని.. ఎందుకంటే ఆయన జగన్ ఆడుతున్న ఆటలో అరటి పండు మాత్రమేనని ఎద్దేవా చేశారు. అస్సైన్డ్ భూముల వ్యవహారంపై విచారణ పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వేదింపులకు తెర తీస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై కక్షతోనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటి కేసులు పెట్టారని.. ఈ తప్పుడు కేసులపై న్యాయపోరాటానికి దిగిన బాబుకు టిడిపి నాయకులు కార్యకర్తలేకాక రాష్ట్ర ప్రజలు కూడా అండగా ఉంటారని అయన పేర్కొన్నారు అంతేకాకుండా సీఎం జగన్ ఎన్ని ఎత్తులు వేసినా.. చంద్రబాబును ఎదుర్కొలేరని జవహర్ స్పష్టం చేసారు. వైసీపీ నేతలు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే తాము చూస్తు ఊరుకోమని జవహర్ హెచ్చరించారు.