బంగారు కాదు కంగారు తెలంగాణ!
posted on Mar 18, 2021 @ 6:03PM
తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పని తీరుపై రిటైర్డ్ ఐపీఎస్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని వీకే సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో మంచి పోలీస్ అధికారులకు విలువ లేదన్నారు. బంగారు తెలంగాణలో పనిచేసే సీనియర్లకు స్థానం లేదన్నారు. రిటైర్డ్ అయిన వారికి మంచి పదవులు కట్టబెడుతున్నారని, చాలామంది సీనియర్లు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. చాలా మంది నిజాయితీ అధికారులు మౌనంగా ఉన్నారన్నారు. సేవచేయడానికి పోలీసు శాఖలోకి వచ్చానని తెలిపారు. తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తోందని వీకే సింగ్ మండిపడ్డారు. బంగారు తెలంగాణ కేసీఆర్ పాలనలో కంగారు తెలంగాణ గా మారిందన్నారు.
ప్రస్తుతం పోలీస్ విభాగంలో ఉన్న మార్పులు మెదక్ లో తానే మొదటగా మొదలుపెట్టానని చెప్పారు వీకే సింగ్. పోలీస్ ట్రైనింగ్ లో సమూల మార్పులు కావాలని కోరుకున్నానని తెలిపారు. తన వీఆర్ఎస్ ను క్యాన్సిల్ చేసిన కేసీఆర్ సర్కార్ తనకు ఛార్జ్ మెమోరీ ఇచ్చిందన్నారు. సర్కార్ తనను వేధిస్తుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతానని వీకే సింగ్ చెప్పారు. కీలకశాఖలకు అధికారులు లేరని.. తెలంగాణ ఆర్టీసీ మునిగిపోతుందన్నారు. తెలంగాణలోనే ఉండి ప్రజల తరపున పోరాడుతానని తెలిపారు. డబుల్ బెడ్ రూం స్కీం ఎక్కడ పోయిందని వీకే సింగ్ ప్రశ్నించారు. సెక్రెటేరీయట్ పడగొట్టి కొత్తది కట్టడం అప్రస్తుతమన్నారు. తెలంగాణ కొంతమంది నాయకుల కోసం రాలేదన్నారు వీకే సింగ్.
తెలంగాణ లో అధికారులపై కులం, మతం, డబ్బు ప్రభావం, రాజకీయ ఒత్తిడి ఉంటుందని చెప్పారు రిటైర్డ్ ఐపీఎస్ వీకే సింగ్. పదిహేను రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదన్నారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లా పదవుల్లేకుండా పని చేస్తానన్నారు. తెలంగాణలో ఊరూరు తిరిన కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేస్తానని తెలిపారు వీకే సింగ్.