కాంగ్రెస్ పార్టీపై రాజయ్య ఎఫెక్ట్ పడుతుందా?
posted on Nov 4, 2015 @ 11:51AM
అసలే కాంగ్రెస్ పార్టీకి ప్రజాదారణ అంతంతమాత్రమే ఉంది. ఎన్నికల్లో పోటీ చేసినా కానీ గెలుస్తుంది అన్న నమ్మకం లేదు. ఇప్పుడు కొత్తగా రాజయ్య తలనొప్పి వచ్చిపడింది. మొదట వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజయ్యను బరిలోకి దించిన సంగతి తెలిసింది. అయితే ఈరోజు జరిగిన ఘటనతో రాజయ్య పోటీకి విముఖత చూపించడంతో ఈస్థానంలో సర్వే పేరును ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఇప్పుడు రాజయ్య ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ మీద పడుతుందా అంటే.. అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. రాజయ్య ఎంతమాత్రం తనకు తానుగా పోటీ నుండి తప్పుకున్నా.. ఆ స్థానంలో పోటీ చేసే ఏ అభ్యర్ధికైనా రాజయ్య ఎఫెక్ట్ పడుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎందుకంటే ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఏదో యాక్సిడెంటల్ జరిగిన సంఘటన అయితే ప్రజలు అంత పట్టించుకోకపోవచ్చు కానీ ఈ ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయి. గతంలోనే రాజయ్య, కోడలు సారికకు తరచూ గొడవలు జరుగుతుండేవని.. అంతేకాదు రాజయ్య కుటుంబంపై సారిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు రాజయ్యకు ఎంపీ టికెట్ ఇవ్వద్దూ అంటూ సారిక అధిష్టానాని లేఖ రాయడం వెరసి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపచ్చు అనుకుంటున్నారు. మరి రాజయ్య ఎఫెక్ట్ ఎంతవరకూ పడుతుందో చూడాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.