వివేకాది రాజకీయ హత్యే..
posted on Apr 2, 2021 @ 3:56PM
తన తండ్రి హత్య జరిగి రెండు ఏళ్ళు అయింది. అయినా నిందితులు ఎవరో తెలియదు. న్యాయం కోసం వెళితే మీ ఏరియాలో ఇలాంటి హత్యలు జరగడం మాములే కదా అన్నారు. మాజీ మంత్రి కి న్యాయం జరగకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని.. నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందన్నారు. తన తండ్రి ఏపీ దివంగత సీఎంకు సోదరుడని.. ప్రస్తుత సీఎం జగన్‌కు స్వయానా బాబాయ్ అని ఆమె చెప్పారు. తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని కోరారు.
ఈ కేసు విషయంలో కొందరు అధికారులను కలిశా. కడప ప్రాంతంలో హత్యలు సాధారణం అన్నట్లు వారు మాట్లాడారు. హత్యలు జరగడం సాధారణమెలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు. హత్య కేసులో సాక్షులకు హాని జరుగుతుందేమోనని భయమేస్తోంది. నాన్న హత్య గురించి మాట్లాడేందుకు..వాస్తవం చెప్పేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. నాన్న అందరితో ప్రేమగా మెలిగేవారు.. ఆయనకు శత్రువులెవరూ లేరు. ఆర్థిక పరమైన కారణాలతో హత్య జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది రాజకీయ హత్యే’’ అని సునీతారెడ్డి అన్నారు.