విశాఖ రాజధానిగా మారే అవకాశం ఉందా?
posted on Dec 26, 2019 @ 11:09AM
రాజధాని పట్ల రోజు రోజుకు ఉత్కంఠత పెరిగిపోతూనే ఉంది.ఎవరి ప్రాంతంలో వారు రాజధాని కాబోతుందన్న అంచనాలతో ఉన్నారు.అమరావతి నుంచి విశాఖపట్నానికి రాజధాని బదిలీ అవుతున్న నేపథ్యంలో అమరావతిపై కమిటీ వేయాలన్న యోచనలో సీఎం జగన్ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని నగరం పై ఆలోచనలు చేస్తున్నామని అసెంబ్లీ సమావేశాల్లో సీఎం అన్నప్పుడే రాజధాని తరలిపోవటం ఖాయమని తేలిపోయింది. జీఎన్ రావు కమిటీ నివేదిక కూడా రాజధానిగా విశాఖను తీర్చి దిద్దాలని సిఫారు చేసింది. రాజధాని నిర్మాణానికి 33,000 ల ఎకరాలు ఇచ్చిన రైతులు ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చ జరగనుంది.
పరిపాలనా భవనాలు, హై కోర్టు బెంచ్ విశాఖలో అసెంబ్లీ భవన సముదాయం హై కోర్టు బెంచ్ అమరావతిలో హై కోర్టు కర్నూలు లోనే ఏర్పాటు చేస్తూ తీర్మానం చేయనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిలో రైతులు చేపడుతున్న ఆందోళనలు చర్చకు రానున్నాయి. ఈ ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదు. అమరావతి గ్రామాల ప్రజలు మినహా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఎవరూ ఆందోళన చెందడం లేదని వాదిస్తోంది. గన్నవరం విమానాశ్రయం విస్తరణ సమయంలో సేకరించిన వెయ్యి ఎకరాలకు పరిహారంగా రాజధాని ప్రాంతంలో రైతులకు భూములిచ్చారని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వారిలో చాలా మంది భూములను విక్రయించేసుకున్నారని అంటున్నాయి. ప్రభుత్వం సమీకరించిన భూముల్లో దాదాపు పదిహేను వేల ఎకరాలు క్రయ విక్రయాలతో చేతులు మారాయని వెల్లడిస్తున్నాయి. రాజధానిలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే అధికంగా ఉన్నారని అమరావతి పై ఆధారపడ్డ వారిలో స్థానికేతరులే అత్యధికమని చెబుతున్నాయి.
వీరంతా వ్యాపార లావాదేవీల్లో భాగంగా క్రయ విక్రయాలు జరిపారే తప్ప రాజధాని పై ప్రేమతో కాదన్నది ప్రభుత్వ వర్గాల వాదన. రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అందజేస్తామని చెబుతున్నాయి. రాజధానే లేనప్పుడు ఈ ప్లాట్లకు విలువేమి ఉంటుందన్న ప్రశ్నకు సమాధానం లేదు. రైతులు కోరుకుంటే గతంలో వారిచ్చిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని రోడ్లు వేసినా ప్రాంతాలకు భూమి ధర లెక్కగట్టి భూయజమానులకు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. వీటిన్నింటి పైనా రైతులతో భూ యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా మంత్రుల కమిటీ వేసే యోచనలో జగన్ ఉన్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. క్యాబినెట్ లో దీనిపై సమగ్ర నిర్ణయం తీసుకున్నాక కమిటీ పై ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో మంత్రులు అధికారులతో ఈ కమిటీని ప్రకటించవచ్చునని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి.మరి రాజధాని పట్ల ఏం జరగబోతోంది అన్న విషయం రేపటి భేటిలో తెలనుంది.