డీఎస్సీ 2020 నోటిఫికేషన్ విడుదల....
posted on Dec 26, 2019 @ 11:25AM
ప్రభుత్వ నోటిఫికేషన్ లు విడుదలైయ్యాయి అంటే చాలా యువతలో ఎనలేని ఉత్సాహం నెలకొంటుంది.ఉపాధ్యాయ వృత్తిని కోరుకుంటున్న ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ 2020 నోటిఫికేషన్ వచ్చే ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా మండల పరిషత్ ప్రభుత్వ మోడల్ గురుకులాలతో పాటు మున్సిపల్ పాఠశాలల్లో కలిపి ఖాళీగా ఉన్న దాదాపు 10,000 ల నుంచి 12,000 ల వరకు ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 75 నుంచి 480 మంది వరకు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలను ఒక యూనిట్ గా తీసుకుని ఖాళీలను నిర్ధారిస్తారు. ఉన్నత పాఠశాలలో మొత్తం తొమ్మిది మంది టీచర్లు ఉండాలి.
వీరిలో ఆరుగురు సబ్జెక్టు టీచర్లు కాగా ముగ్గురు భాషా పండిట్లు ఉండాలి. ఈ ప్రకారం లేని పాఠశాలల వివరాలను సేకరించనున్నారు. అదే సమయంలో త్వరలో రిటైర్ అయ్యేవారికి వివరాలనూ పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా సేకరించి డీఎస్సీ 2020 నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం డీఎస్సీ 2018 పేరిట మొత్తం 7,902 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దివ్యాంగుల కోసం 602 టీచర్ పోస్టులతో ప్రత్యేకంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే విద్యార్హతలు ఇతర సాంకేతిక అంశాలను కారణాలగా చూపుతూ పలువురు న్యాయ స్థానాల్లో కేసులు వేశారు. ఆయా కేసులపై విచారణ పెండింగ్ లో ఉంది. కోర్టు కేసులు లేని 2,654 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెల 22 జిల్లాల్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు నియామక పత్రాలు అందజేశారు.
కోర్టు కేసుల కారణంగా ఇంకా 5,850 టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. వాటిపై ఉన్న కేసులన్నింటినీ జనవరి నెలాఖరు లోగా పరిష్కరించే దిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. వచ్చే జనవరి మొదటి వారంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ జారి చేసి నెలాఖరులో పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నాలుగు లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునే అవకాశముందని అంచనా, అలాగే డీఎస్సీ 2020 కి ఐదారు లక్షల మంది దరఖాస్తు చేస్తారని పాఠశాల విద్యా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టెట్, డీఎస్సీల నిర్వహణకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయనుంది.