జగన్ కు విశాఖ ఉక్కు సెగ!
posted on Jul 14, 2022 @ 11:09AM
జగన్ కు ఎల్లడలా నిరసనలే వ్యక్తమౌతున్నాయి. అమరావతి వీడి విశాఖకు మకాం మార్చి అక్కడ నుంచే పాలన సాగించాలన్న యోచనలో ఉన్న జగన్ కు విశాఖ ఉక్కు సెగ బలంగా తాకుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేయాలన్నది కేంద్రం నిర్ణయమే అయినా ఆ ప్రభావం మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మరీ ముఖ్యంగా జగన్ పైనే పడుతోంది.
నోరు తెరచి అడగకుండానే ప్రతి విషయంలోనూ కేంద్రానికి మద్దతుగా నిలబడుతూ వస్తున్న జగన్ కనీసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్రాన్ని ఒక్క మాట కూడా అడగకుండా మిన్నకుండటంపై విశాఖ వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. మరో వైపు కేంద్రం విశాఖ ఉక్కులోని ఒక్కో విభాగాన్ని వాయు వేగంతో ప్రైవేటుకు అప్పగించేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కుకు బొగ్గు సరఫరా నిలిచిపోయింది.
ఇది ఉక్కు కార్మికులలో ఆగ్రహాన్ని పెంచడమే కాకుండా అడ్డుకోవాలన్న కృత నిశ్చయంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కార్మికుల ఆగ్రహం కేంద్రంలోని మోడీ సర్కార్ తో పాటు అంతే తీవ్రంగా ఏపీలోని జగన్ సర్కార్ పైనా వ్యక్తమౌతోంది. ఆంధ్రుల హక్కు అంటూ నినదించి దక్కించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్రం ప్రై ‘వేటు’ వేయడాన్ని అడ్డుకోవడం అటుంచి వత్తాసు పలుకుతారా అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని నిర్వీర్యం చేస్తుంటే అక్కడి రైతులు ఉవ్వెత్తున ఉద్యమించారు. కోర్టులు మొట్టికాయలు వేశాయి. అయినా జగన్ లో చలనం లేదు.. మా ఆగ్రహాన్ని మాత్రం జగన్ నే కాదు ఆయన సర్కార్ ను కూడా కదిలించేస్తుందని వారు అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని విస్మరించినా ఊరుకున్నాం కానీ, యావదాంధ్ర పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామంటూ మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
ఝార్ఖండ్లో విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన బొగ్గు గనిని ఏక పక్షంగా కేంద్రం రద్దు చేసిందని, అలాగే బ్లాస్ట్ ఫర్నేస్ ను గత ఆరు నెలల నుంచి మూసేశారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతూనే.. అంతకు మించి తీవ్రతతో జగన్ సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఉన్న బొగ్గుగనిని రద్దు చేయడమే కాకుండా.. ఇంకో వైపు వేరే చోటు నుంచి బొగ్గు తెచ్చకోవడానికి వీల్లేకుండా రైల్వే వ్యాగన్స్ ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంందులు పెడుతుంటే.. జగన్ ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు.
అన్ని విషయాలలోనూ కేంద్రానికి వత్తాసు పలికిన జగన్ రాష్ట్రం కోసం కనీసం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయలేదని కూడా ఎందుకు అడగడం లేదని నిలదీస్తున్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం రాష్ట్రప్రభుత్వం ముదుకు రావాల్సి ఉండగా అందుకు భిన్నంగా మీ చిత్తం వచ్చినట్లు ప్రైవేటుకు కట్టబెట్టండి అంటూ జగన్ సర్కార్ చేతులు ముడుచుకు కూర్చోవడమేమిటని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పాలన సాగించాలని భావిస్తున్న జగన్ కు ఉక్కు సెగ గట్టిగానే తగులుతుందని పరిశీలకులు అంటున్నారు.