బాబుపై పూలు వేస్తుంటే రాయి పడిందట.. నందిగామ ఘటనపై సీపీ వివరణ
posted on Nov 5, 2022 @ 10:23AM
తాడి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటూ దూడగడ్డి కోసం అన్నాడట వెనకటికెవడో? అలా ఉంది నందిగామ పర్యటనలో శుక్రవారం రాత్రి (నవంబర్4) చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడిపై విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా స్పందన చూస్తుంటే. చంద్రబాబుపై పూలు వేశారనీ, ఆ సమయంలో పొరపాటున రాయో అలాటి వస్తువు ఏదో పడి ఉండొచ్చని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నందిగామ పర్యటనలో కరెంటు సరఫరా నిలిచిపోయిన సమయంలో రాళ్ల డాడి జరగడం ఆ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడటం తెలిసిందే. ఈ సంఘటనపై విజయవాడ సీపీ క్రాంతిరాణా టాటా స్పందించారు. రాయి తగిలి సీఎస్ఓ కు గాయమైనట్లు వెల్లడించారు. ఆయనకు ప్రథమ చికిత్స అందించిన తరువాత యధావిధిగా విధులకు హాజరయ్యారని చెప్పారు. 15 కెమెరాల ఫుటేజ్, మీడియా ఫుటేజ్ ల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నామన్నారు.
చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగరీ సెక్యూరీటీ ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని బహుళ అంతస్తుల భవనాలపై సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్న క్రాంతి రాణా.. ఇద్దరు ఐపీఎస్ లతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. జగ్గయ్యపేట నుంచీ మొత్తం భద్రత ఏర్పాటు చేసామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతోందన్న సీపీ.. పూలు వేయడంలో రాయి లేదా అలాంటిది ఏమైనా పడి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
గతంలో ఇలాగే దాడి జరిగినప్పుడు అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ జనం భావప్రకటనా స్వేచ్ఛ ఉపయోగించుకున్నారని వ్యాఖ్యనించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసి ఉంటుంది. సరే బాబుపై తాజా దాడికి సంబంధించి మరో రెండు రోజుల్లో నిజానిజాలు బయటపెడతామని సీపీ క్రాంతి రాణా టాటా పేర్కొన్నారు.