మీడియాపై రాములమ్మ రుసరుసలు
posted on Apr 13, 2013 @ 12:06PM
మొన్నటి దాకా తన మెదక్ సీటుకి కేసీఆరే స్వయంగా ఎసరు పెట్టేట్లు ఉన్నాడని బెంగపెట్టుకొన్న తెరాస నేత విజయశాంతి, మొన్న పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం తరువాత రాబోయే ఎన్నికలలో తామిరువురము పోటీ చేస్తామని కేసీఆర్ ఆమె సమక్షంలో ప్రకటించిన తరువాత కొంచెం శాంతించింది. కానీ, ఆ ప్రకటన కూడా స్పష్టంగా లేకపోవడంతో ఇంకా ఆమెకు అనుమానంగానే ఉంది. తనకు మెదక్ నుంచి పార్టీ టికెట్ ఇస్తారా వేరే మరెక్కడికయినా తరిమేస్తారా? లోక్ సభకు టికెట్ అన్నాడా లేక శాసన సభకు టికెట్ అని ఆయన ఉద్దేశ్యమా? మాట నిలకడలేని కేసీఆర్ నిజంగా టికెట్ ఇస్తాడా లేక ఆఖరి నిమిషంలో హ్యాండిస్తాడా వంటి అనేక అనుమానాలు ఆమెకున్నాయి. ఇటువంటి సమయంలో ఆమెను కొందరు విలేకరులు ‘మీరు ఎక్కడి నుండి పోటీ చేయబోతున్నారు?’ అని ప్రశ్నించేసరికి ఆమెకు పుండు మీద కారం చెల్లినట్లయింది. “నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తే మీకెందుకు అయినా నాకు లేని ఆత్రుత మీకెందుకు?” అని వారిపై రుసరుసలాడింది. నిజమే! కందకు లేని దురద కట్టి పీటకు ఎందుకు?