చిరంజీవి బాటలో విజయశాంతి...
posted on Jan 4, 2020 @ 10:20AM
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా మెగాస్టార్ చిరంజీవి బాటలో నడవబోతున్నారనే మాట వినిపిస్తోంది. చిరంజీవి దారిలోనే విజయశాంతి కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే చర్చ జరుగుతోంది. పాలిటిక్స్ ఫుల్ స్టాప్ పెట్టేసి, ఇకపై సినిమాల్లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, గతంలో ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినా, రాజకీయాల మీదే తాను పూర్తిగా దృష్టిపెట్టానన్న విజయశాంతి... ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. అయితే, సరిలేరు నీకెవ్వరుతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోన్న విజయశాంతి.... మరో సినిమాకు సైతం సైన్ చేశారని అంటున్నారు. దాంతో, విజయశాంతి ఇక, పాలిటిక్స్ ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో బిజీ అవుతారనే ప్రచారం జరుగుతోంది.
విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా... క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే, సినిమాలపై దృష్టిపెట్టి రాజకీయాలకు సమయం తగ్గించారని సన్నిహితులు చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ లో కూడా విజయశాంతి ఇమడలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది. టీకాంగ్రెస్ నేతలు తనను అస్సలు పట్టించుకోవడం లేదని, అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని, కొందరు సీనియర్లయితే... తనను పొమ్మనలేక పొగ పెడుతున్నారని సన్నిహితులతో రాములమ్మ వాపోయినట్లు తెలుస్తోంది.
అయితే, విజయశాంతి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీవ్రంగా ప్రయత్నిస్తోన్న కమలనాథులు.... విజయశాంతికి ఆహ్వానం పంపారు. కానీ, మళ్లీ బీజేపీలో చేరేందుకు రాములమ్మ ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దాంతో, అటు కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా లేకపోవడం... ఇటు రారమ్మంటున్న బీజేపీలోకీ వెళ్లనంటున్న రాములమ్మ.... చిరంజీవి బాటలో రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెబుతారనే అనుమానాలు పెరుగుతున్నాయి. మొత్తానికి సరిలేరు నీకెవ్వరు మూవీతో విజయశాంతి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడం, కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా లేకపోవడంతో, రాములమ్మ రాజకీయ ప్రస్థానంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.