కేసీఆర్ పై రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది: విజయశాంతి
posted on Dec 9, 2020 @ 10:45AM
నియంతృత్వ పాలన సాగిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రిపై రైతులు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. భారత్ బంద్‌కు కేసీఆర్ మద్దతు తెలపడం పట్ల ఆమె ట్విట్టర్ ద్వారా తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు బంధునని చెప్పుకుని, ఫాంహౌస్ రాజకీయాలతో రాబంధులా వ్యవహరించే సీఎం దొరగారి నిజ స్వరూపం తెలియడం వల్లే .. ఆయన తుపాకి రాముడు మాటలను నమ్మలేక దుబ్బాక ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారని విజయశాంతి అన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన రైతులు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందని విజయశాంతి చెప్పారు.
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతృత్వంలో జరిగిన బంద్‌లో చివరి క్షణంలో ఎంట్రీ ఇచ్చి మొత్తం క్రెడిట్‌ని హైజాక్ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ గారు తెగ ఆరాటపడ్డారు.. కాని సీఎం గారి ఎత్తుగడలు జీర్ణించుకోలేక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కొత్త వ్యూహంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయని విజయశాంతి ట్వీట్ లో చెప్పారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రైతుల పక్షాన బంద్ చేశామని చెబుతున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు త్వరలో కేసీఆర్ గారి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలపై ఆందోళన చెయ్యాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు చెబుతున్నారన్నారు. దీని ద్వారా కేసీఆర్‌ను కూడా ఇరకాటంలో పెట్టాలని వారి వ్యూహమని అని విజయశాంతి చెప్పారు. రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల బంద్ పిలుపునకు మద్దతిచ్చిన కేసీఆర్ గారు, మరి ఆ పార్టీలు తెలంగాణలో చేసే ఆందోళనల్ని కూడా సమర్థిస్తారా? అని విజయశాంతి ప్రశ్నించారు.