ధర్మాన అధర్మ యుద్ధం
posted on Mar 7, 2012 9:16AM
విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా నర్సన్నపేట అసెంబ్లీ ఉప ఎన్నిక మంత్రి ధర్మాన ప్రసాదరావుకు పెను సవాలుగా మారింది. తన సోదరుడు ధర్మాన కృష్ణ దాస్ ఈ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. దీంతో తనసోదరుడుని ఓడించే బాధ్యత మంత్రి ధర్మానపై పడింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి ఎంపికపై ఆయన ఏమాత్రం తొందరపడటం లేదు. కానీ నియోజకవర్గ పరిధిలోని మండల, గ్రామస్థాయి నేతలను తన వైపు తిప్పుకోవడానికి ఆయన చర్యలు ప్రారంభించారు. జగన్ పార్టీ పెట్టిన తరువాత చాలామంది మండల, గ్రామస్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి ఆ పార్టీలో చేరారు. తిరిగి వారిని కాంగ్రెస్ గూటికి రప్పించేందుకు ధర్మాన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆయన గ్రామస్థాయి నాయకులకు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. వారికి ప్రభుత్వ కాంట్రాక్టులతోపాటు చిన్న చిన్న పదవులు ఎర చూపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తిరిగేందుకు వాహనాలు ఇస్తామని, ఎన్నికల తరువాత వాటిని తమవద్దే ఉంచుకోవచ్చుని ధర్మాన అనుయాయులు మండల, గ్రామస్థాయి నేతలను ఊరిస్తున్నారు. దీంతో కలవరపడ్డ ధర్మాన కృష్ణదాస్ తానుమాత్రం ఎటువంటి అడ్డదారులు తొక్కకుండా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. తన ప్రత్యర్ధులు (ధర్మాన తదితరులు ) అధర్మ యుద్దానికి దిగనప్పటికీ తాను అలా చేయనని, ఇతరుల వలె తాను తుచ్ఛ రాజకీయాలకు పాల్పడనని ఆయన అంటున్నారు.