బడుగులతో పరిటాల సునీతకు చెక్?
posted on Mar 7, 2012 9:22AM
రాప్తాడులో పావులు కదుపుతున్న కాంగ్రెస్
రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నియోజకవర్గంలో అన్నిపార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నది అగ్రవర్ణాల వారే.అయితే నియోజకవర్గంలో మెజారిటి ఓటర్లు బడుగువర్గాల వారే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాప్తాడు నియోజకవర్గంలో బడుగువర్గాలకు చెందిన వ్యక్తిని పరిటాల సునీతకు పోటీగా ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా రాప్తాడు మాజీ ఎంపిపి బలరాముడు, మద్దెల చెరువు నాగిరెడ్డి (డిసి) పేర్లను నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ నియోజకవర్గంలో బలరాముడికి మంచి పేరు ప్రతిష్టలున్నాయి. బడుగు బలహీనవర్గాల్లో మంచి ఆదరణ ఉంది. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర రాజకీయ హవా కొనసాగుతున్న సమయంలో కూడా రాంబాబు స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశారు. ఇక మద్దెల చెరువు నాగిరెడ్డి విషయానికి వస్తే ఆయన మంత్రి ఎన్. రఘువీరారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. మంత్రి ఆయనకు రాప్తాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అప్పగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా బడుగు వర్గాల నాయకుడిని ముందుపెట్టి పరిటాల సునీతను దెబ్బతీయాలని కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.