నగరి బరిలో తెలుగుదేశం అభ్యర్థి వాణీ విశ్వనాథ్?
posted on Oct 14, 2022 @ 5:01PM
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నగరి బరి నుంచి మాజీ హీరోయిన్ వాణి విశ్వనాథ్ ను బరిలో నిలపాలని తెలుగుదేశం యోచిస్తోందా? నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేకు దీటుగా పోటీ ఇవ్వగలిగే అభ్యర్థి వాణీ విశ్వనాథ్ అని భావిస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే ఔననే అనాల్సి ఉంటుందంటున్నారు పరిశీలకులు.
అప్పుడెప్పుడో గత ఎన్నికల ముందు నగరిలో తెలుగుదేశం అభ్యర్థిగా వాణి విశ్వనాథ్ పేరును తెలుగుదేశం పరిశీలించింది. అయితే అప్పట్లో ఆ పరిశీలన పరిశీలన స్థాయిలోనే ఆగిపోయింది. వాణి విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరిందీ లేదు.. నగరి అభ్యర్థిగా రంగంలోకీ దిగలేదు. మళ్లి ఇన్నాళ్లకు మరోసారి నగరి తెలుగుదేశం అభ్యర్థిగా వాణి విశ్వనాథ్ పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం నగరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు ఉన్నారు. ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనే ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నారు.
అయితే హఠాత్తుగా వాణి విశ్వనాథ్ తెరపైకి వచ్చారు. పార్టీ పరంగా ఇప్పటి వరకూ అధికారికంగా ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. అలాగే ఆమె పార్టీలో చేరిందీ లేదు. కానీ ఇటీవల ఆమె నగరిలో పర్యటించి చేసిన ప్రసంగాలు మాత్రం ఆమె నగరి బరిలోకి దిగుతారని అంతా భావించే విధంగా ఉన్నాయి. ఆమె నగరి పర్యటన సందర్భంగా ఆమెతో కొందరు కౌన్సిలర్లు, మాజీ కౌన్నిలర్లు ఉన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ నగరి నుంచి ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించారు. అయితే తెలుగుదేశం అభ్యర్థిగానే రంగంలో ఉంటానని ఆమె చెప్పలేదు. కానీ నగరిలో తమిళ ఓటర్ల సంఖ్య దృష్ట్యా, ఆమె అభ్యర్థి అయితే ఆ మేరకు పార్టీకి లబ్ధి జరుగుతుందని తెలుగుదేశం భావిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగుదేశం బలంగా ఉన్న నగరి నియోజకవర్గంలో గత ఎన్నికలలో రోజా గెలుపునకు తమిళ ఓట్లే దోహదపడ్డాయన్న అభిప్రాయం అయితే బలంగా ఉంది. ఇప్పుడు రోజాకు ఆ అవకాశం, తమిళ ఓట్ల మద్దతు దూరం చేసే వ్యూహంతోనే వాణి విశ్వనాథ్ ను బరిలోకి దింపాలని తెలుగుదేశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
అయితే వాణి విశ్వనాథ్ పర్యటన వెనుక, ప్రకటనల వెనుకా తెలుగుదేశం మద్దతు ఉందా లేదన్న అన్నది ఇదమిద్థంగా తేలలేదు. కాగా తెలుగు సినిమాలలో ఒక సమయంలో వాణి విశ్వనాథ్, రోజాల మధ్య వృత్తిపరమైన పోటీ ఉండేది. ఇరువురూ కలిసి సర్పయాగం అనే సినిమాలో కూడా నటించారు. మొత్తం మీద నగరిలో వాణి విశ్వనాథ్ పోటీ చేయడమన్నది జరిగితే నగరిలో పోటీ రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు అంటున్నారు.