చట్టాన్ని అతిక్రమిస్తే గుండెల్లో నిద్రపోతా...చంద్రబాబు
posted on Oct 14, 2022 @ 4:55PM
చట్టాన్ని అతిక్రమిస్తే మీ గుండెల్లో నిద్రపోతా, తప్పు చేసినవాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ అధి నేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. శుక్రవారం తమ పార్టీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. చట్టాన్ని ఉల్లంఘించేవారు అధికారులైనా సరే శిక్ష తప్పదని బాబు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపట్ల ఆయన మండిపడ్డారు.
తెలుగు దేశం పార్టీకి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందని, దేశంలో చరిత్ర సృష్టించిన ఘనత తమ పార్టీకి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం లాంటి దిక్కుమాలిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తన జీవితంలో కనీసం ఊహించలేదన్నారు. ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కక్షసాధించే తీరులో ప్రవర్తిం చలేదన్నారు. ఈ ప్రభు త్వం పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టిందని, ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని బాబు మండిపడ్డారు. వైసీపీ ఎంపీ రఘురామ పైనా పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తుండటాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన్ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు దారుణంగా వేధించారని, ఆయన రాష్ట్రానికి రాలేని పరిస్థితి కల్పించారన్నారు.
వైసీపీ అధికారంలోకి రాగానే ముందు ఇచ్చిన హామీలు, మద్దతులు మర్చిపోయారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అమరావతి రాజధానిగా ఒప్పుకుని, ఇపుడు అధికారంలో అమరావతిని రాజధాని విషయంలో మాటమార్చి మూడు రాజధానుల పేరుతో ప్రాంతీయద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.