వల్లభనేని వంశి.. రెంటికి చెడ్డ రేవడేనా!
posted on Aug 24, 2023 @ 11:52AM
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించి.. ఆ తరువాత కొద్ది రోజులకే జగన్ పార్టీ పంచన చేరిన వంశీ నాటి నుంచి గన్నవరంలో తెలుగుదేశం కోటను పగలగొట్టడమే పనిగా పని చేశారు. తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగత విమర్శలు, అసభ్య దూషణలకు తెగబడి నియోజకవర్గంలోని తన సామాజిక వర్గానికే కాకుండా.. నియోజకవర్గ ప్రజలకు కూడా దూరమయ్యారు.
అయితే అధికార పార్టీ అండ చూసుకుని రెచ్చిపోయారు. పూర్తిగా వైసీపీని నమ్ముకుని వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి రెడీ అయిన వంశీ.. ఆ క్రమంలో తనకు అడ్డువస్తాడన్న భయంతో గత ఎన్నికలలో తనకు ప్రత్యర్థిగా నిలిచి పరాజయం పాలైన యార్లగడ్డకు చెక్ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా, వికటించాయా అన్న అనుమానాలు ఇప్పుడు ఆయనలోనే వ్యక్తం అవుతున్నాయి. యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిపోయారు. గన్నవరం నుంచే తెలుగుదేశం అభ్యర్థిగా పోటీకి రెడీ అయిపోయారు. అంటే వచ్చే ఎన్నికలలో కూడా వంశీ, యార్లగడ్డల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. వల్లభనేని వంశి పట్ల నియోజకవర్గంలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను గమనించిన వైసీపీ అధిష్ఠానం పార్టీ టికెట్ పై ఆయనకు ఇచ్చిన హామీపై వెనక్కు తగ్గిన సంకేతాలను ఇస్తున్నది. అందుకు కారణంగా గన్నవరం పరిధిలోని నున్న గ్రామంలో ఒక వార్డుకు జరిగగిన ఉప ఎన్నికలో వంశీ నిలబెట్టిన అభ్యర్థి పరాజయాన్ని చూపుతోంది.
నున్నవల్లభనేని వంశీ కొద్ది రోజులుగా ఏమీ మాట్లాడటం లేదు. హైకమాండ్ నుంచి సందేశం వస్తే చాలు బూతులతో విరుచుకుపడేందుకు ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటారు. కానీ ఇప్పుడు ఆయన పెద్దగా మాట్లాడటం లేదు. లోకేష్ గన్నవరం పర్యటనకు వస్తున్నారని.. బహిరంగసభ పెట్టబోతున్నారని తెలిసిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్లారు… పారిపోయారని అంటారని చెప్పి మళ్లీ .. సభ రోజు గన్నవరం వచ్చారు కానీ మీడియాతో మాట్లాడలేదు. లోకేష్ పై ఎలాంటి ఆరోపణలు చేలేదు. నోరు చేసుకోలేదు. ఎందుకా అని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో గన్నవరం పరిధిలోని నున్న గ్రామంలో ఓ వార్డు స్థానానికి ఎన్నిక జరిగింది. నున్న గ్రామం వైసీపీకి చాలా బలమైన స్థావరం.. అక్కడ రెడ్డి సామాజికవర్గం సంఖ్య ఎక్కువ. అటువంటి చోట కూడా ఒక వార్డు ఉప ఎన్నికలో వైసీపీకి చావుదెబ్బ తగిలింది.
వంశీపై వ్యతిరేకతే అందుకు కారణమని వైసీపీ నిర్ధారణకు వచ్చింది. నియోజవర్గ వ్యాప్తంగా వంశీ పట్ల ఇదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గతంగా పార్టీ నిర్వహించుకున్న సర్వేలో కూడా ఇదే తేలడంతో వంశీకి గన్నవరం టికెట్ విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా యార్లగడ్డ పార్టీని వీడేందుకు వంశీ తీరే కారణమనీ, యార్లగడ్డకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఒకింత గౌరవం, మర్యాద వంశీ ఇచ్చి ఉంటే ఆయన తెలుగుదేశం వైపు వెళ్లే వారు కాదనీ జగన్ ఇప్పుడు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో వంశీకి వ్రతమూ చెడి, ఫలమూ దక్కక రెంటికీ చెడ్డ రేవడిలా పరిస్థితి తయారైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే సమయం సందర్భం లేకున్నా విమర్శలతో, తిట్లతో విరుచుకుపడే వంశీ తన గన్నవరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర ప్రభంజనంలా సాగుతున్న సమయంలో కూడా నోరు మెదరపకుండా మౌనంగా ఉండిపోయారనీ, అసలు లోకేష్ పాదయాత్రకు ముందు ఆయన గన్నవరం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారనీ, అయితే చివరి నిముషంలో మనసు మార్చుకుని గన్నవరం వచ్చారనీ, అయినా లోకేష్ తనపై చేసిన విమర్శలపై స్పందించకుండా మౌనాన్ని ఆశ్రయించడానికి కారణం వైసీపీలో తనకు ఆదరణ తగ్గడమే కారణమని అంటున్నారు. మొత్తం మీద వంశీకి నిన్న మొన్నటి దాకా గన్నవరం వైసీపీ టికెట్ పై ఉన్న ధీమా ఇప్పుడు పూర్తిగా పోయిందనీ, దీంతోనే మౌనం వినా మరో గత్యంతరంలేని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.