ఆముదాలవలస తమ్మినేని చేయి జారినట్లేనా? వైసీపీ ప్లాన్ ఏమిటి?
posted on Aug 24, 2023 @ 10:46AM
ఏపీలో ఎన్నికల కాక పెరిగింది. ముఖ్యంగా అధికార వైసీపీలో పార్టీ టికెట్ల లొల్లి ఆ పార్టీకి మొదటికే మోసం తెచ్చేదిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార వైసీపీ.. దానిని అధిగమించడానికి పేరుగొప్ప ఎమ్మెల్యే పదవి తప్ప.. ఇంకే ప్రాధాన్యతా లభించక ఇంత కాలం లోలోపలే ఆవేదనతో మగ్గిపోయిన ఎమ్మెల్యేలపైనే వేటు వేయాలని భావిస్తున్నది. ఆ విషయంలో వైసీపీ ఎటువంటి తారతమ్యాలకూ చోటివ్వడం లేదు. మంత్రులు కూడా పార్టీ టికెట్ విషయంలో గ్యారంటీ లభించక ఏం జరుగుతుందో? ఏం జరిగితే ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మధనపడుతున్నారు. అలా వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కదు అన్న వారి జాబితాలో దాదాపు మొదటి పేరుగా స్పీకర్ తమ్మినేని సీతారాం పేరు గట్టిగా వినిపిస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో మరో సారి వైసీపీ జెండా ఎగురవేయాలంటే.. ఆ స్థానంలో కొత్త ముఖాన్నీ పోటీలో నిలబెట్టడమొక్కటే మార్గమన్న నిశ్చితాభిప్రాయానికి పార్టీ అధినేత జగన్ వచ్చేశారని అంటున్నారు. అందుకోసం సమర్ధులైన అభ్యర్థి కోసం గాలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈసారి సీటు దక్కడం దాదాపు అసాధ్యం అంటున్నారు. ఆయన పట్ల నియోజకవర్గ ప్రజలలోనే కాదు, వైసీపీ క్యాడర్ లో కూడా పూర్తి వ్యతిరేకత వ్యక్తమౌతోందంటున్నారు. ఈ నేపధ్యంలో కొత్త ముఖాన్ని బరిలోకి దించితే తప్ప ఆముదాలవలస నియోజకవర్గంలో కనీస పోటీ అయినా ఇచ్చే పరిస్థితి ఉండదని వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి.
దీంతో ఆ స్థానంలో వైసీపీ జెండా మరోసారి ఎగరేయాలంటే అందుకు సమర్ధుడైన, బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడమొక్కటే మార్గమని జగన్ నిర్ణయానికి వచ్చేశారనని పార్టీ శ్రేణులు అంటున్నాయి. దీంతో ఆయన చూపు బోడేపల్లి వారసులపై పడిందని అంటున్నారు. జిల్లా రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు శతజయంతి వేడుకలను ప్రభుత్వం ఇటీవల అధికారికంగా నిర్వహించడం వెనుక ఆయన వారసులను పార్టీలోకి ఆహ్వానించి ఆముదాల వలస నుంచి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బొడ్డేపల్లి రాజగోపాల్ కోడలు బొడ్డేపల్లి సత్యవతిని వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. బోడేపల్లి వారసురాలిగా సత్యవతి 2004, 2009 ఎన్నికలలో ఆముదాల వలస నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. విభజన అనంతరం 2014, 2019లలో అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలయ్యారు.
వరుసగా రెండు పరాజయాల తరువాత కూడా బోడేపల్లి సత్యవతి కాంగ్రెస్ ని వీడకుండా ఆ పార్టీకి ఆముదాలవలసలో పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ బాధ్యతలను చూస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూడా ఆమె ఆముదాలవలస నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అయితే ఆమెను కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి తీఎసుకుని రావడం ద్వారా 2024 ఎన్నికలలో లబ్ధి పొందాలని వైసీపీ అధినేత భావిస్తున్నారు. అందులో భాగంగానే బోడేపల్లి రాజగోపాల్ శతజయంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ బొడ్డేపల్లి సత్యవతితో సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఇక పోతే బోడేపల్లి సత్యవతి వైసీపీ గూటికి చేరడం అంటూ జరిగితే.. తమ్మినేని తిరుగుబాటు చేయడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే తమ్మినేని ఇప్పటికే ఆముదాలవలస టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని అధిష్ఠానాన్ని డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉందని పరిశీలకులు అంటున్నారు.