ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన... ఎందుకంటే!
posted on Mar 28, 2016 @ 9:54AM
గత వారం పదిరోజులుగా ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకి కేంద్రం ఓ అనూహ్యమైన ముగింపుని ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనను విధిస్తూ ఉత్తర్వును జారీ చేసింది. కొద్దిరోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్‌లో విధించిన రాష్ట్రపతి పాలన గురించి ఇంకా మర్చిపోకుండానే, మరో రాష్ట్రంలోని ప్రభుత్వం నిద్రాణస్థితిలోకి వెళ్లిపోయింది.
ఉత్తరాఖండ్‌లోని హరీశ్‌రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయ్‌బహుగుణ వంటి నేతలు ఆది నుంచీ గళం ఎత్తుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి పనితీరు పట్ల వీరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించసాగారు. విజయ్‌బహుగుణకు హరీష్‌రావత్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి కలగడానికి కారణం లేకపోలేదు. 2012లో అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ తరఫున విజయ్‌బహుగుణను ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. కానీ రెండేళ్లు గడువకుండానే, ఆయన చేత రాజీనామా చేయించి... ప్రభుత్వ పగ్గాలను హరీశ్‌రావత్‌కు అప్పగించారు. ఇలా తరచూ ముఖ్యమంత్రులను మార్చే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించేందుకు ప్రయత్నించింది. కానీ రోజులు మారుతున్నాయన్న విషయం గ్రహించలేకపోయింది.
గద్దె దిగిన ముఖ్యమంత్రిగా విజయ్‌బహుగుణ సహజంగానే అసంతృప్తితో రగిలిపోవడం మొదలుపెట్టారు. తన అసంతృప్తిని పార్టీ అధినాయకత్వానికి చేరవేసినా, వారి నుంచి ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం వినిపించలేదన్నది ప్రధాన ఆరోపణ. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో కూడా కాంగ్రెస్ అధినాయకత్వం ఇలాగే పట్టీపట్టనట్లు ఉందని ఆరోపణలు వినిపించాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో నిరసన గళమెత్తిన ఎమ్మెల్యేలు సోనియా, రాహుల్ గాంధిలను కలిసే ప్రయత్నం చేసినా వారు అంతగా ఆసక్తిని చూపలేదన్న విమర్శలు వినిపించాయి. ఇక్కాడా విజయ్‌బహుగుణ ప్రభుత్వం పట్ల అసమ్మతిని రాజేస్తూ, నిదానంగా తన శిబిరంలోని సంఖ్యను పెంచుకోవడం మొదలుపెట్టారు. ఆ సంఖ్య ప్రభుత్వాన్ని దెబ్బతీసే స్థాయికి చేరుకుందని నిర్ధరణకు వచ్చాక, అదను కోసం వేచి చూడసాగారు. విజయ్‌బహుగుణని సాధారణ నేపథ్యమేమీ కాదు. ఆది నుంచీ వారి కుటుంబం రాజకీయాలతో ముడిపడి ఉంది. దానికి తోడు న్యాయవాదిగా ఎత్తుకుపైఎత్తు వేయగల చాతుర్యమూ ఉంది. ఆ అనుభవమూ, చతురతా ఇప్పుడు కలిసివచ్చాయి.
మార్చి 18న ఉత్తరాఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితేనే అక్కడి ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం నిధులను వెచ్చించగలదు. అలాంటి కీలకమైన బిల్లుని ఆమోదించేందుకు అసమ్మతి ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. దాంతో స్పీకర్ బిల్లుని ఎలాగొలా పాసైందని అనిపించారు. ప్రభుత్వం కీలకమైన బిల్లుని కూడా ఆమోదింపచేయలేని పరిస్థితిలో ఉందంటూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రపతి పాలనను విధించింది. కేంద్ర ప్రభుత్వ చర్యని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఈ సోమవారం అక్కడి ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవలసి ఉండగా, హడావుడిగా కొద్ది గంటల ముందుగానే అసెంబ్లీని రద్దు చేయడం ఏంటని మండిపడుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ భయాలు వేరేలా ఉన్నాయి...
71మంది సభ్యులు ఉన్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ నుంచి 36 మంది ఎమ్మెల్యేలు, భాజపా నుంచి 28 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గట్టు దాటడంతో బలాబలాలు తారుమారైపోయాయి. పరిస్థితి తమకు అనుకూలంగా లేదని హరీశ్‌రావత్‌కు స్పష్టం కావడంతో, అసమ్మతివాదులైన 9 మంది ఎమ్మెల్యేల మీదా అనర్హత వేటు వేయించారు. దాంతో మిగతా చిన్నాచితకా పార్టీల మద్దతుతో బలపరీక్షను దాటేయవచ్చని ఆయన ఆలోచన. ఈ వ్యూహాన్ని పసిగట్టిన కేంద్రప్రభుత్వం ఆదరాబాదరాగా రాష్ట్రపతి పాలనను విధించింది. పైగా అసమ్మతితో ఉన్న నాయకులను కూడా హరీశ్ కొనే ప్రయత్నం చేశారన్న తీవ్రమైన ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ లావాదేవీలకు సంబంధించిన ఓ సీడీని కూడా అసమ్మతి నేతలు విడుదల చేశారు. ఈ సీడీలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్ కొన్ని ‘లెక్కల’ గురించి మాట్లాడటం గమనించవచ్చు. ఈ సీడీ విడుదలతో కేంద్ర ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలనను విధించేందుకు మరింత బలమైన కారణం దొరికినట్లైంది.
ఏదేమైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడం విషాదకరం. రాజకీయ నేతలలో దిగజారుతున్న నైతిక విలువలే దీనికి కారణం కావచ్చు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా వసుధైక కుటుంబంలా అన్ని పార్టీలూ లావాదేవీలతోనే రాజకీయాలను నడిపేందుకు సిద్ధపడిపోతున్నాయి. దీనికి ఫలితాన్ని అనుభవించేది మాత్రం సామాన్యులే! మరి ఆ సామాన్యుల ఆలోచన ఎలా ఉందో! ఎవరిని ఎన్నుకున్నా ఏమున్నది గర్వకారణం అంటూ నిస్తేజంతో మునిగిపోతారో లేకపోతే పరిస్థితులను అసహ్యించుకుని తామే ప్రత్యక్ష రాజకీయాలలోకి దూసుకువస్తారో చూడాలి!