భారత్‌కు లాక్‌డౌనే బెటర్.. మోదీ తప్పు చేశారు..
posted on May 1, 2021 @ 6:52PM
ఇండియాలో వెంటనే లాక్‌డౌన్ విధించాలి. అత్యవసర చికిత్సాకేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. కరోనా ఉధృతి పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థ ఉండాలి. ఇలా.. భారత్‌కు మూడు కీలక సూచనలు చేశారు అమెరికాకు చెందిన అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అధ్యక్షుడు జో బైడెన్ వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ. ఈ మేరకు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
కొవిడ్‌పై విజయం సాధించామని భారత్ ముందే ప్రకటించి తప్పు చేసిందని ఫౌచీ గుర్తుచేశారు. ప్రస్తుతం భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. దేశాన్ని తాత్కాలికంగా షట్‌డౌన్ చేయడం అత్యవసరం అన్నారు. లాక్‌డౌన్ విధించడానికి ఏ దేశమూ ఇష్టపడదని.. కానీ, కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల పెద్ద సమస్యలేమీ తలెత్తవని తెలిపారు. నెలల తరబడి షట్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని.. కొన్ని వారాల పాటు అమలు చేస్తే వైరస్ వ్యాప్తి ఆగిపోతుందని వివరించారు.
వెంటనే ఆక్సిజన్, మెడిసిన్, పీపీఈ కిట్లు సమకూర్చుకోవాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ఫౌచీ సూచించారు. ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. భారత్ రకం వైరస్‌పై ఇంకా లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు.
కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను ఆంటోనీ ఫౌచీ ప్రముఖంగా ప్రస్తావించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఇప్పటి వరకు కేవలం 2 శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయి టీకా అందించారని తెలిపారు. ఈ లెక్కన వ్యాక్సినేషన్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో వీలైనంత త్వరగా ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు.
ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలవాలని ఫౌచీ పిలుపునిచ్చారు. కీలక వైద్య సరఫరాలను సమకూర్చుకునేందుకు ఓ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని దానికోసం ఓ కమిషన్ లేదా అత్యవసర గ్రూప్ వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా సహా ఇతర దేశాలు భారత్‌కు దన్నుగా నిలవాలని ఫౌచీ పిలుపునిచ్చారు. గతంలో భారత్ ఇతర దేశాలకు సాయం చేయడంలో చాలా ఉదారంగా వ్యవహరించిందన్నారు. అదే తరహాలో ఇప్పుడు భారత్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ఆంటోనీ ఫౌచీ.