ఈటల మొనగాడేనా? కేసీఆర్‌ను ఢీకొట్టి నెగ్గుతారా? చరిత్ర ఏం చెబుతోంది?
posted on May 1, 2021 @ 5:28PM
శుక్రవారం వరకూ టాప్ లీడర్. పవర్‌ఫుల్ మినిస్టర్. కరోనా సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యమకారుడిగా, కేసీఆర్ అనుచరుడిగా.. పార్టీలో మంచి ప్రయారిటీ ఉంది. కట్ చేస్తే.. కేలండర్‌లో డేట్ మారినంత ఈజీగా ఈటల రాజకీయ భవితవ్యం మారిపోయింది. రాత్రికి రాత్రే.. ఆయనపై భూకబ్జాల నెపం మోపబడింది. వెంటనే విచారణా మొదలైపోయింది. ఆ వెంటనే ప్రాథమిక నివేదికా వచ్చేసింది. ఆ వెనువెంటనే ఆరోగ్యశాఖ ఆయన నుంచి లాక్కోబడింది. ఇలా ఈటల రాజేందర్ అనే నేత... ఒక్కరోజులోనే రాజకీయంగా అథఃపాతాళానికి తోసేయబడ్డారు. కేసీఆర్ ఎంత ఖతర్నాక్ పొలిటీషియనో ఈటల ఎపిసోడ్‌తో మరోసారి చర్చకు వస్తోంది.
బాంచ్చెన్ దొర అన్నంత కాలమే.. కేసీఆర్ కనుసన్నల్లో పని చేసినంత కాలమే.. టీఆర్ఎస్‌లో మనుగడ. కాదని.. గులాబీ జెండాకు ఓనర్లం మేమేనని.. తల ఎగరేసే వారి పరిస్థితి.. ఇలానే తలకిందులు అయిపోతుందనేది కేసీఆర్ గురించి బాగా తెలిసిన వారు చెబుతున్న మాట. ఇవాళ ఈటల రాజేందర్‌కు ఆ పరిస్థితి వచ్చింది. అంతకుముందు అనేక మంది హేమాహేమీలాంటి నేతలు సైతం ఇలానే కేసీఆర్ రాజకీయ క్రీడకు బలి పశువులు అయ్యారని గుర్తు చేస్తున్నారు.
ఎకరి వరకో ఎందుకు.. ప్రొఫెసర్ కోదండరాంనే తీసుకోండి. ఉద్యమంలో దాదాపు కేసీఆర్‌కు సమాన స్థాయి ఉన్న నేత ఆయన. కేసీఆర్ ఇంట్లో కూర్చొని రాజకీయ చదరంగం ఆడుతుంటే.. తెలంగాణ జేఏసీ తరఫున ప్రజాక్షేత్రంలో ఉద్యమ కార్యచరణను అమలు చేసింది కోదండరాం సారే. ఆ సమయంలో ప్రొఫెసర్‌ను ఉద్యమంలో ఎంతగా వాడుకోవాలో అంతకు మించే వాడేసుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత.. కూరలో కరివేపాకులా తీసి పారేశారు. తెలంగాణ వచ్చాక.. కోదండరాం పరిస్థితి ఎలా మారిందో అంతా చూస్తూనే ఉన్నాం. కేసీఆర్ దెబ్బ కొడితే.. ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి కోదండరామే కళ్ల ముందు కనిపించే సాక్షం.
అంతకుముందు ఆలె నరేంద్ర. విజయశాంతిల విషయంలోనూ ఇలానే జరిగింది. ఆలె నరేంద్ర.. టైగర్ నరేంద్రగా బీజేపీలో ఓ వెలుగు వెలిగారు. తెలంగాణ కోసం కమలం పార్టీని కాదని.. సొంతంగా పార్టీ పెట్టారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు తన పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచి.. కేంద్రమంత్రి అయ్యారు. పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. తనకు సమ స్థాయిగా ఎదిగాడనే అక్కస్సో.. ఆలె తో అవసరం తీరిపోయిందనో.. కారణం తెలీదుగానీ.. ఆ తర్వాత కేసీఆర్ నరేంద్రను పక్కనపెట్టేశారు. పార్టీ నుంచి పంపించేశారు. ఆ తర్వాత ఆలె నరేంద్ర పేరు చరిత్రలో కలిసిపోయింది.
విజయశాంతి విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. సినీ కెరీర్‌లో లేడీ అమితాబ్‌గా, రాములమ్మగా రాణించిన విజయశాంతి.. తల్లి తెలంగాణ పార్టీతో రాజకీయ రణక్షేత్రంలోకి వచ్చారు. కేసీఆర్ విసిరిన పాచికకు పడిపోయారు. పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయించి.. కేసీఆర్‌కు దేవుడిచ్చిన చెల్లిగా పార్టీలో అందలమెక్కించి.. అవసరం తీరాక.. అక్కడి నుంచి పాతాళంలోకి పడేశారు. గులాబీ బాస్ రాజకీయ క్రీడకు బలయ్యారు లేడీ ఫైర్‌బ్రాండ్.. విజయశాంతి.
ఇలా.. టీఆర్ఎస్‌లో కల్వకుంట్ల కుటుంబం మినహా.. బయటి వారెవ్వరినీ నెంబర్ టూ గా ఎదగనివ్వరు కేసీఆర్. కాంగ్రెస్‌లో కాకలు తీరిన నేతలుగా ఏలిన.. కేకే, డీఎస్ లాంటి వాళ్లు సైతం కారు ఎక్కాక.. కిమ్మనకుండా ఓ మూలన కూర్చున్నారు. ఈటల లాంటి వాళ్లు స్వతహాగా నాయకత్వ లక్షణాలతో పార్టీలో కీలక నేతగా రాణించినా.. ఇలా సమయం చూసి.. ఛాన్స్ చిక్కినప్పుడు సైడ్ చేయడంలో కేసీఆర్‌ది మాస్టర్ మైండ్ అంటారు. అందుకే, టీఆర్ఎస్‌లో ఎవరికైనా నెంబర్ 2 అనే పట్టం కట్టారో.. ఇక వారి రాజకీయ ఎదుగుదలకి సమాధి తప్పదన్నట్టే.
కేవలం టీఆర్ఎస్ అనే కాదు.. నెంబర్ 2 పొజిషన్ ఏ పార్టీలోనూ, ఎవరికీ కలిసొచ్చేలా లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు.. టీడీపీలో దేవేందర్‌గౌడ్ నెంబర్ 2 పొజిషన్‌లో ఉండేవారు. సీఎం చంద్రబాబు ఆయనకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. హోంమంత్రిగా ఓ వెలుగువెలిగారు. రాజకీయంగా ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో సడెన్‌గా టీడీపీకి రాజీనామా చేసి అందరికీ షాకిచ్చారు దేవేందర్‌గౌడ్. ప్రత్యేక తెలంగాణ కోసమంటూ చంద్రబాబును, తెలుగుదేశాన్ని వీడి.. నవ తెలంగాణ పార్టీ స్థాపించారు. కొత్త పార్టీలో ఆయనే కింగ్ మేకర్. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పోటీ పడ్డారు. కొన్ని రోజులు బాగా హడావుడి చేశారు. ఆ తర్వాత సొంతంగా రాజకీయాలు ఎంత కష్టమో తెలిసొచ్చాయి. పార్టీని పీఆర్పీలో కలిపేసి.. మళ్లీ పార్టీ మారి.. క్రమంగా కాలగర్భంలో కలిసిపోయారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోనూ వైసీపీలో విజయసాయిరెడ్డి నెంబర్ 2గా ఉన్నారు. జగన్‌రెడ్డితో పాటు కేసుల్లో ఇరుక్కొని.. జైల్లో ఊచలు లెక్కబెట్టి.. ఎంపీగా వెలిగిపోతున్నారు. అయితే, ఆయన ఈ మధ్య జగన్‌కు తెలీకుండా ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీతో బాగా అంటకాగుతున్నారని.. అది జగన్‌కి ఏమాత్రం ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి. అందుకే, త్వరలోనే ఏపీ రాజకీయాల్లోనూ ఉలిక్కిపాటు తప్పదంటున్నారు కొందరు విశ్లేషకులు. బీజేపీ డైరెక్షన్‌లో జగన్ సీటుకు విజయసాయి ఎసరు పెట్టే అవకాశం లేకపోలేదంటున్నారు. లేదంటే, సరైన సమయంలో విజయసాయికి జగన్‌రెడ్డి చెక్ పెట్టడం ఖాయమని భావిస్తున్నారు.
ఇలా.. ఈటల ఎపిసోడ్‌తో తెలుగురాష్ట్రాల్లో జరిగిన అనేక రాజకీయ ఎత్తుగడలు మరోసారి చర్చకొస్తున్నాయి. వాటిని చూసి కేసీఆర్ ఎంత ఖతర్నాకో గుర్తు చేస్తున్నారు. మరి, రాజకీయ చాణక్యుడితో విభేదించి ఈటల నెగ్గుకొస్తారా? సొంత కుంపటి పెట్టుకొని రాణిస్తారా? బీసీలకు రాజ్యాధికార స్వప్నం నెరవేరుస్తారా? లేక, కోదండరాం, ఆలె నరేంద్ర, విజయశాంతిలా రాజకీయంగా కనుమరుగు అవుతారా? చూడాలి...