చివరి నిమిషంలో ట్రంప్ తొండాట.. పోలీసు కాల్పులలో మహిళ మృతి
posted on Jan 7, 2021 @ 9:44AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజేత అయిన జో బైడెన్‌కు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. 306-232 ఓట్ల తేడాతో ఎన్నికలలో నెగ్గిన డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌ను ఎలక్టోరల్ కాలేజీ ఓటర్లు ఈరోజు అంటే.. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం లాంఛనంగా ఎన్నుకోవలసి ఉంది. దీనికోసం అమెరికా కాంగ్రెస్ లోని ప్రతినిధుల సభ, సెనేట్ సంయుక్తంగా సమావేశం కానున్నాయి. అయితే ఈ ఎన్నికను అడ్డుకోవాలని ట్రంప్ తన మద్దతుదారులకు పిలుపు ఇవ్వగా దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో రాజధాని వాషింగ్టన్‌కు తరలివచ్చారు.
వారంతా వైట్‌హౌ్‌సకు కూతవేటు దూరంలోని ఫ్రీడమ్ ప్లాజాలో ప్రస్తుతం బైఠాయించారు. గడ్డకట్టే చలిలో.. ఒకపక్క నిరంతరం వర్షం కురుస్తున్నా వారంతా అక్కడి నుంచి కదలడం లేదు. ఎన్నికల సందర్భంగా ఓటింగ్, లెక్కింపులో అక్రమాలు జరిగాయని.. దీంతో ఎన్నిక రద్దుచేసి మళ్లీ జరిపించాలంటూ ట్రంప్ బృందం కోర్టులకు వెళ్లినా అక్కడ చుక్కెదురైంది. న్యాయపరమైన దారులు మూసుకుపోవడంతో.. ఇక ట్రంప్ కు మిగిలిన ప్రత్యామ్నాయమేమిటో అయన మద్దతుదారులకు కూడా అంతుపట్టడం లేదు. అయితే ట్రంప్ వ్యవహార శైలిపై సొంత రిపబ్లికన్ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
"అధ్యక్ష ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు, మోసం జరిగాయని రాష్ట్రాలకు తెలుసు. తమ ఓట్లను సరిదిద్దాలని అవి భావిస్తున్నాయి. పెన్స్ చేయాల్సిందల్లా.. ఆ ఓట్లను వెనక్కి పంపడమే. అయన అలా చేస్తే మనదే విజయం. మైక్.. ఈ పని నువ్వు చేయాలి. దీనికోసం అత్యంత తెగువ చూపాల్సిన సమయమిది" అని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తాను చెప్పినట్లు చేయకపోతే పెన్స్ రాజకీయంగా దెబ్బతింటారంటూ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. మరోపక్క అధ్యక్షుడి సూచనను పెన్స్ తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి.
ఇటువంటి నేతలు అధికారం చేపడతారని బహుశా రాజ్యాంగ కర్తలు కూడా ఊహించి ఉండరేమో.. కనీసం ఇటవంటి నేతలు తమ ఓటమిని ఒప్పుకుని హుందాగా పదవి నుండి తప్పుకుంటే అందరికి గౌరవంగా ఉండేది. అయితే ప్రస్తుతం ప్రపంచంలోని కొంత మంది నేతల తీరు మాత్రం.. "మొండి వాడు రాజు కంటే బలవంతుడు.. అయితే పరిపాలించే రాజే కనుక మొండివాడైతే.. బహుశా వారి ప్రవర్తన ట్రంప్ లాగే ఉంటుందేమో.." ఇలాంటి వారు తాము పరిపాలించే సమయంలో దేశాన్ని, ప్రజలను ఎం ఉద్దరించారో తెలీదు కానీ.. దిగి పోయేటపుడు మాత్రం ఏకంగా సామాన్యప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టడానికి వెనుకాడట్లేదు. తాజాగా అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద చేరిన ట్రంప్ మద్దతుదారులు గలభా సృష్టించి లోపలి దూసుకు వచ్చే ప్రయతం చేయగా .. వారి పై జరిగిన కాల్పులలో ఒక మహిళ మృతి చెందింది.
అమెరికాలో జరిగిన ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ స్పందించారు. వాషింగ్టన్‌లో జరిగిన హింసాత్మక ఘటన బాధ కలిగించిందన్నారు. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని, నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియను ఆటంకపరచడం సరికాదంటూ ట్వీట్ చేశారు.