కేటీఆర్ ఇప్పట్లో ముఖ్యమంత్రి కాలేరా! నిఘా సంస్థల నివేదికలే కారణమా?
posted on Jan 7, 2021 9:16AM
తెలంగాణ ప్రభుత్వంలో కీలక మార్పులు ఉంటాయని కొంత కాలంగా జరుగుతున్న చర్చ ప్రచారంగానే మిగిలిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనపై కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఈ టర్మ్ మొత్తం కేసీఆరే పాలన చేస్తారని గులాబీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావించింది నిజమేనని.. కాని కొన్ని రోజులుగా ఆయన మైండ్ సెట్ లో మార్పు వచ్చిందంటున్నారు కారు పార్టీ లీడర్లు.
కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని గత ఏడాదిన్నరగా ప్రచారం జరుగుతోంది. 2019 మొదట్లో జరిగిన మున్సిపల్ ఎన్నికలు కాగానే కేటీఆర్ ను సీఎం చేస్తారని చర్చ జరిగింది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల సమయంలో మళ్లీ ఆ అంశం తెరపైకి వచ్చింది. గ్రేటర్ ఫలితాల తర్వాత కొందరు ఎమ్మెల్యేలు ఈ విషయాన్నిఓపెన్ గానే చెప్పారు. సీనియర్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఓ అడుగు ముందుకేసి.. మార్చి లోపు కేటీఆర్ సీఎం కావడం ఖాయమంటూ ముహుర్తం కూడా చెప్పేశారు. కొత్త సంవత్సరంలోని తొలి రెండు, మూడు నెలల్లో కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయంగా ఉంటుందని అంతా భావించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి రావడంతో.. కేటీఆర్ ను సీఎంను చేసే అంశంపై ఆయన కేంద్రం పెద్దలతో మాట్లాడారనే చర్చ కూడా జరిగింది. అయితే సడెన్ గా సీన్ మారిందంటున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్న నిర్ణయాన్ని గులాబీ బాస్ మార్చుకున్నారని తెలంగాణ భవన్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
కేటీఆర్ ను సీఎం చేయడంపై కేసీఆర్ వెనక్కి తగ్గడానికి నిఘా వర్గాల సమాచారమే కారణమట. కేటీఆర్ ను సీఎం చేస్తే పార్టీలో ఎలా ఉంటుంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి స్పందన ఉంటుందన్న దానిపై ఇంటిలిజెన్స్ తో సర్వే చేయించారట కేసీఆర్ . అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. టీఆర్ఎస్ చీలిపోయే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయని చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడు పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలకు వల వేస్తోంది. కాంగ్రెస్, కారు పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు కమలం నేతలు. ప్రస్తుతం టీఆర్ఎస్ రెండు వర్గాలుగా ఉందనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న నేతలంతా హరీష్ రావు కోటరిలో ఉండగా.. బంగారు తెలంగాణ బ్యాచ్ లీడర్లంతా కేటీఆర్ వెంట ఉన్నారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ ను సీఎం చేస్తే... ఉద్యమ నేతలంతా తమ దారి తాము చూసుకునే అవకాశం ఉందని నిఘా సంస్థలు కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయని తెలుస్తోంది. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే మంత్రి హరీష్ రావు కూడా పార్టీ నుంచి బయటికి రావొచ్చనే ప్రచారం కూడా ఉంది.
కేసీఆర్ పరిధిలో ఉండే రాష్ట్ర సంస్థలే కాదు కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయని చెబుతున్నారు. కేంద్ర సంస్థల సర్వే ఫలితాలు తెలుసు కాబట్టే.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతారని కచ్చితంగా చెప్పారంటున్నారు. కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచన కూడా కేసీఆర్‌కు లేదని సంజయ్ చెప్పడానికి నిఘా సంస్థల రిపోర్టే కారణమంటున్నారు. నిజానికి కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని కొన్ని రోజులుగా చెబుతున్నారు బండి సంజయ్. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారుతారని ప్రకటనలు చేయాలి. అందుకు భిన్నంగా కేటీఆర్ ఇప్పట్లో సీఎం కారని చెప్పడానికి కేంద్రం నుంచి అతనికి వచ్చిన ఇన్ పుట్స్ కారణం అయి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఏ రకంగా చూసినా తెలంగాణకు మరో మూడేళ్ల వరకు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని, కేటీఆర్ కు ఆ ఛాన్స్ లేదన్నదే టీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.