పెళ్ళయితేనే పార్కులోకి ఎంట్రీ! జీహెచ్ఎంసీ తీరుపై లొల్లీ..
posted on Aug 27, 2021 @ 1:21PM
ఇందిరా పార్క్’కు వెలుతున్నారా? ఒక్క క్షణం ఆగండి ... మీ మ్యారేజ్ సర్టిఫికేట్ జేబులో పెట్టుకుని వెళ్ళండి ... లేదంటే లోపలకి రానీయరు. అదేంటి, పార్క్ కి పెళ్ళికి ఏమిటి సంబంధం అంటారా.. ఉంది.. పెళ్ళైన జంటలకే కాని, పెళ్లి కానీ జంటలకు పార్కులోకి అనుమతి లేదని, అధికారులు పార్క్ బయట పెద్ద బోర్డు పెట్టి మరీ చెప్పారు. ఆ విధంగా పార్క్’కు ప్రేమకు, పార్క్’కు పెళ్ళికి లింక్ పెట్టి ప్రేమ జంటలకు నో ..ఎంట్రీ అని అధికారులు బోర్డు పెట్టారు.
అసలు, విషయం ఏమంటే పార్కులలో పెళ్ళికాని ప్రేమ జంటల ప్రవర్తన శృతితప్పి గీత దాటుతోందని పిల్లలతో వచ్చిన తల్లి తండ్రులు, సీనియర్ సిటిజన్స్ ఫిర్యాదు చేశారు. అలాగే, కొన్ని కొన్ని సందర్భాలలో కొట్లాటలు గొడవలు వంటి ఇతర సమస్యలు తలెత్తడంతో అధికారులు పెళ్ళికాని ప్రేమ జంటలకు నో ..ఎంట్రీ .. అని బోర్డ్ పెట్టారు. అయితే, అది సోషల్ మీడియాలో వైరలై, అధికారులు ‘మోరల్ పోలీసింగ్’ పై జనం విరుచుకు పడ్డారు. స్వేచ్చకు సంకెళ్ళు వేస్తారా? అంటూ చీవాట్లు పెట్టారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు దిగి వచ్చారు. కట్టిన బ్యానర్ విప్పేశారు. నగర మేయర్ విజయలక్ష్మి సహా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని క్రింది స్థాయి సిబ్బంది తెలియక చేసిన తప్పుగా చెప్పు కొచ్చారు. సంజాయిషీ ఇచ్చుకున్నారు. అలాగే, పెళ్ళికాని జంటలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని అధికారాలు విచారం కూడా వ్యక్తపరిచారు.
ఇంతవరకు అంతా బానే ఉంది. అయితే, బ్యానర్ విషయంలో అధికారులను అలర్ట్ చేసిన సామాజిక కార్యకర్త పేర్కొన్న విధంగా ఇలా బహిరంగ ప్రదేశాలలో ప్రవేశంపై అక్షలు రాజ్యాంగ విరుద్ధమా, కాదా అనేది న్యాయ నిపుణులు సమాధానం ఇవ్వవలసిన ప్రశ్న. నిజానికి, దేశంలో ఒక్క మన ఇందిరా పార్క్’లోనే కాదు, ఇంకా అనేక బహిరంగ ప్రదేశాలలోకి కూడా అందరినీ అనుమతించరు. ఆ మధ్య శబరిమల, శని సింగపూర్ ఆలయాలలోకి మహిళలను అనుమతించక పోవడంఫై పెద్ద దుమారామే చెలరేగింది. న్యాయస్థానాల జోక్యంతో కానీ, ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ, అన్ని మతాల ప్రార్థనా స్థలాలో వివిధ రకాలఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆఫ్గానిస్థాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న నేపధ్యంలో ఆ దేశంలో మహిళల పై విధించిన ఆంక్షలు మన దేశంలోనూ చర్చకు వస్తున్నాయి. సామాజిక కార్యకర్తలు, మేథావులు, రాజకీయ పార్టీలు, తాలిబాన్లు అమలు చేస్తున్న, షరియా చట్టాలను సైతం సమర్ధిస్తున్నారు. మన దేశంలో మాత్రం విచ్చలవిడి తనాన్ని కట్టడి చేసినా, మోరల్ పోలీసింగ్’ అంటూ విమర్శిస్తున్నారు.అయితే, ఏ సమాజంలో అయినా, సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు ఉంటాయి. ఉండాలి కూడా .. కానీ, కట్టుబాట్లు కట్లు తెంచుకో కూడదు. అలాగే, స్వేచ్చకు పరిధులు, పరిమితులు ఉంటాయి.
నిజానికి హైదరాబద్ నగరంలో మోరల్ పోలీసింగ్ కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సం రోజున.. ఒక్క ఇందిరా పార్క్ మాత్రమే కాదు, జీహెచ్ఎంసీ పరిధిలోనే అన్ని పార్కులలోకి ప్రేమ జంటల ఎంట్రీపై హైదరాబాద్ పోలీసులే ఆంక్షలు విధించారు. భజరంగ దళ్ వంటి సంస్థల మోరల్ పోలీసింగ్ కు చెక్ పెట్టేందుకే, నగర పోలీసులు ఆంక్షలు విధించవలసి వచ్చిందని అధికారులు అంటున్నారు. అయితే అదీ ఇదీ ఏదీ కూడా గీత దాటకుండా ఉంటేనే మంచింది. అందుకే పెద్దలు, ‘అతి సర్వత్ర వర్జియేత్’ అంటారు.