ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా?
posted on Oct 18, 2024 @ 2:56PM
ఆంధ్రప్రదేశ్ పై ప్రకృతి పగబట్టిందా? అన్నట్లుగా వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటిగా తుపానులు రాష్ట్రంపై దాడి చేస్తున్నాయి. ఒక తుపాను తీరం దాటిందని ఊపిరి పీల్చుకునేలోగానే మరొకటి అన్నట్లుగా రాష్ట్రాన్ని వీడటం లేదు. రోజుల తరబడి భారీ వర్షాలతో రాష్ట్రం తడిసి ముద్దౌతోంది. ఈ నెల 16న వాయుగుండం నెల్లూరు సమీపంలో తీరం దాటింది. ఆ వాయుగుండం ఇంకా పూర్తిగా బలహీనపడలేదు. వానలు కురుస్తూనే ఉన్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఇంతలోనే వాతావరణ శాఖ మరో తుపాను హెచ్చరిక జారీ చేసింది.
ఈ నెలలో మరో రెండు తుపానుల ముప్పు ఇంకా ఉందని హెచ్చరించింది. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఇది బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అది తీరం దాటగానే మరో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. అయితే వీటి దిశ, గమనంపై మరో రెండు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.