టీవీ ముందు పిల్లలు ఠీవీగా కూర్చుంటున్నారా? అయితే, డేంజరే!
posted on Jun 6, 2017 @ 11:26AM
చిన్న పిల్లలు బొద్దుగా వుంటే ముద్దుగా అనిపిస్తారు! పదేళ్లు, పదకొండేళ్ల పిల్లలు కూడా లావుగా వుంటే బాగానే వుంటారు! కాని, ఆ తరువాత కూడా గాలి నింపిన బెలూన్ల మాదిరిగా వుంటే? వయస్సు పెరిగే కొద్దీ లావుదనం లక్ష సమస్యలు తెచ్చిపెడుతుంది! కాని, ఇప్పుడు తేలిన తాజా సత్యం ఏంటంటే… పెద్దయ్యాక వచ్చే ఓవర్ వెయిట్, ఒబెసిటీ సమస్యలన్నిటికీ చిన్నప్పుడే బీజాలు పడిపోతున్నాయట! అదీ బెడ్ రూంలోని టీవీల రూపంలో!
అధిక బరువు, లావుదనం… వీటికి చిన్న పిల్లల బెడ్ రూంలోని టీవీకి ఏంటి లింక్ అంటారా? బ్రిటన్ లో జరిపిన ఓ భారీ అధ్యయనం ప్రకారం పెద్ద సంబంధమే వుంది! అక్కడ దేశ వ్యాప్తంగా 12వేల మంది పదకొండేళ్ల వయస్సున్న చిన్నారుల పై అధ్యయనం చేశారు! దాంట్లో తేలింది ఏంటంటే… 11ఏళ్లప్పుడు అధిక బరువుతోనో, లావుగానో వున్న పిల్లందరూ 7, 8ఏళ్ల వయస్సప్పుడు బెడ్ రూంలో టీవీ వున్న వారేనట! తమ బెడ్ రూంలో టీవీలు వుండటం వల్ల సదరు పిల్లలు ఒకే దగ్గర కూర్చుండిపోయి శారీరిక శ్రమ లేక బరువు పెరిగారట! లావయ్యారట!
బెడ్ రూంలలో టీవీలు వుంటే అమ్మాయిలు 30శాతం అధిక బరువు, లావు వున్నారట. అబ్బాయిలు మాత్రం 20శాతమే ఓవర వెయిట్, ఒబెసిటీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారట! ఇలా అమ్మాయిలకు మరింత ప్రమాదం ఎందుకంటే… సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అమ్మాయిల శారీరిక శ్రమ తగ్గుతూ వస్తుంది. అబ్బాయిలు ఆట, పాటల్లో గడిపినంత వారు గడపకపోవచ్చు. అందుకే, వారు టీవీ చూడటం మరింత దుష్ఫలితాలు ఇస్తోందట!
బెడ్ రూంలలో టీవీలపై అధ్యయనం చేశారు కాని… అసలు ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు ఎక్కడపడితే అక్కడ ఎలక్ట్రానిక్ తెరలకు అంటుకుపోతున్నారు. టీవీలు, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు వగైరా వగైరా… అన్నీ పిల్లల్ని ఆటపాటలకి దూరం చేస్తున్నాయి! కుందేళ్లలా వుండాల్సిన వారు నిండు కుండల్లా తయారైపోతున్నారు! అందుకే, మీ చిన్నారుల చేతుల్లో ఫోన్లు, కళ్ల ముందు టీవీలు, కంప్యూటర్లు సాధ్యమైనంత వరకూ లేకుండా చూడండి! లేదంటే… భారీ సమస్య భవిష్యత్ లో దాడి చేయటానికి ఆల్రెడీ బయలుదేరిందని అర్థం…