టీటీడీ అనుమతితోనే తిరుమలపై డ్రోన్ సర్వే: అంగీకరించిన ఈవో ధర్మారెడ్డి
posted on Jan 23, 2023 @ 1:44PM
తిరుమత పవిత్రత, భద్రత విషయంలో టీటీడీకి ఇసుమంతైనా చిత్త శుద్ధి లేదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. నోఫ్లై జోన్ అయిన తిరుమల కొండపై డ్రోన్ సర్వేకు సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్ధానమే అనుమతి ఇచ్చిందని తేలడంతో సర్వత్రా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. తిరుమలలో డ్రోన్ సర్వేకు అనుమతి ఇచ్చింది సాక్షాత్తూ తిరుమల తిరుపతి దేవస్థానమేనని స్వయంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి అంగీకరించారు.
తిరమలపై డ్రోన్ సర్వేకు ఐఓసీకి అనుమతి ఇచ్చిన మాట వాస్తవమేనని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెబుతూ అయితే తాము అన్నదానం నుంచి డంపింగ్ యార్డ్ వరకూ మాత్రమే డ్రోన్ సర్వేకు అనుమతి ఇచ్చామని, టీటీడీలో భద్రతకు ఎక్కడా రాజీ పడటంలేదని.. టీటీడీకి హై సెక్యూరీటీ వ్యవస్థ ఉందన్నారు. అయితే డ్రోన్ ఆపరేటర్ అత్యుత్సాహంతో అనుమతించిన పరిధి దాటి చిత్రీకరణ జరిపారని చెప్పారు.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాుకండా తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీని త్వరలో తీసుకొస్తున్నామన్నారు. అయితే డ్రోన్ ద్వారా చిత్రీకరించారంటూ సామాజిక మాధ్యమంలో వైరల్ అయనవి నిజమైనవేనా ఫేకా అన్నది తేలాలని ఈవో ధర్మారెడ్డి సమర్ధించుకోజూశారు. అలా కాకుండా అనుమతించిన మేర కాకుండా అత్యుత్సాహంతో పరిధి దాటి వీడియోలు తీసినట్లు తేలితే డ్రోన్ ఆపరేటర్ పై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికే డ్రోన్‌తో శ్రీవారి ఆలయం చిత్రికరణపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. యూట్యూబ్‌లో ఉన్న వీడియోను తొలగించామన్నారు. ‘నో ఫ్లై జోన్’గా ఉన్న తిరుమల కొండపై డ్రోన్ వీడియో వైరల్ అయిన సంగతి విదితమే. ఇక టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అయితే డ్రోన్తో తిరుమల ఆలయాన్ని చిత్రించే అవకాశమే లేదని చెప్పారు పాత చిత్రంతో యానిమేట్ చేశారని విచారణకు ముందే నిర్ధారించేశారు.