లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి
posted on Jan 23, 2023 @ 2:25PM
కుప్పం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభం కానున్నది. ఆయన పాదయాత్రకు నాన్చి నాచ్చి ఎట్ట కేలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిబంధనలకు లోబడి పాదయాత్ర సాగాలని షరతు విధించింది. అలాగే పాదయాత్రలో ఎటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేయరాదని కండీషన్ పెట్టింది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. రాష్ట్రంలో ఉత్కంఠభరిత వాతావరణం చిక్కన అవుతోంది. ఆయన పాదయాత్రకు అనుమతి విషయంలో పోలీసులు అనుసరిస్తున్న విధానం తెలుగుదేశం శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్ర ప్రారంభానికి ముందే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించే విధంగా పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ పాదయాత్ర ఈ నెల 27 నుంచి శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం యాత్రకు అన్ని ఏర్పాట్లూ చేసింది. కుప్పం నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్రకు నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు.. ఎన్టీఆర్ కుటుంబీకులు అంతా హాజరయ్యేం అవకాశం ఉంది.
మొత్తం రాష్ట్రం దృష్టి అంతా లోకేష్ పాదయాత్రపైనే ఉంది. అందుకే పాదయాత్రకు అనుమతి విషయంలో పోలీసుల వైఖరి పట్ల సర్వత్రా అసహనం వ్యక్తం అవుతోంది. కావాలనే అనుమతి విషయం తేల్చకుండా పోలీసులు తాత్సారం చేయడంపై తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య లేఖకు డీజీపీ స్పందించిన తీరును రాజకీయాలకు అతీతంగా అందరూ తప్పు పడుతున్నారు. ఇప్పటికే అసందర్భం, అనుచితం అయిన జీవో 1తో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్ ప్రభుత్వం.. పోలీసుల ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదనడానికి వర్ల లేఖకు డీజీపీ స్పందనే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. లోకేష్ ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఒక ప్రాంతానికో, నియోజకవర్గానికో పరిమితమైనది కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 400 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ కవర్ అయ్యేలా 4000 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్రలో ఆయనను అన్ని వర్గాల ప్రజలనూ కలుస్తారు. తనను కలవడానికి వచ్చే ప్రజలందరితోనూ మాట్లాడుతారు. ఇందుకు ఆంక్షలు విధించడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం ఒక అగ్నిగోళంగా తయారైంది. పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తే రాష్ట్రంలో జనం స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలకు దిగే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అలాగే పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించడానికీ, చట్ట పరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంలో కూడా తెలుగుదేశం స్పష్టమైన అవగాహనతో ఉందని అంటున్నారు.
గతంలో అంటే విపక్ష నేతగా జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సందర్బంగా ఎటువంటి అనుమతులూ లేకపోయినా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం యాత్రకు పూర్తి భద్రత కల్పించిన సంగతిని ఈ సందర్భంగా తెలుగుదేశం గుర్తు చేస్తున్నది. ఈ పరిణామాలన్నీ గమనించిన సర్కార్ ఎట్టకేలకు లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కింద పడ్డా మాదే పై చేయి అని చెప్పుకునేందుకు, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేయరాదనీ, నిబంధనలను మీరరాదనీ షరతులు విధించింది.
దీనిపై తెలుగుదేశం శ్రేణులు జోకులు పేల్చుతున్నాయి. ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చాలి అని గతంలో విపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ అవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావా అని ప్రశ్నిస్తున్నాయి. సంయమనంతో అంశాల వారీగా విశ్లేషణాత్మక విమర్శలు లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా చేస్తారనీ, అవి రెచ్చగొట్టేవిగా ఉండవనీ, జగన్ దుష్టపాలనను ప్రజలకు అవగతమయ్యేలా వివరణాత్మకంగా ఉంటాయనీ చెబుతున్నారు. లోకేష్ పాదయాత్ర శాంతియుతంగా క్రమశిక్షణతో జరుగుతుందనీ, రెచ్చగొట్టే చర్యలూ, వ్యాఖ్యలకు పాల్పడకుండా పోలీసులు వైసీపీ గూండాలనే నియంత్రించాల్సి ఉంటుందని చెబుతున్నాయి.