టీటీడీ నిలువు దోపిడీ.. కొండెక్కిన గదుల అద్దె!
posted on Jan 9, 2023 5:02AM
తిరుమల ఒక పవిత్ర పుణ్య క్షేత్రం. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ప్రతి రోజూ దేశం నలుమూల నుంచి ఇంకా మాట్లాడితే, ప్రపంచం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు వచ్చి వెంకన్న దేవుని దర్శించుకుంటారు. కానుకలు సమర్పించు కుంటారు. భక్తులు పైసా పైసా కూడబెట్టి, ముడుపులు కట్టి భగవంతునికి సమర్పించుకునే రోజువారీ హుండీ ఆదాయమే లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం( 2022 మర్చి 1 నుంచి 2023 ఫిబ్రవరి 28 వరకు) లో హుండీ ఆదాయం రూ.1000 కోట్లు ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. కానీ, గత మార్చి మొదలు నవంబర్ వరకు ప్రతి నెల రూ. 100 కోట్లకు తగ్గకుండా ఆదాయం వచ్చింది.
మూడు నెలల ముందుగానే గత అక్టోబర్ నాటికే హుండి ఆదాయం వార్షిక అంచనా రూ. 1000 కోట్లను దాటేసింది. దీంతో టీటీడీ తన అంచనాలను సవరించింది. ఈ వార్షిక సంవత్సరంలో రూ. 1600 కోట్లకు పైగా హుండీ ఆదాయం వస్తుందని భావిస్తోంది.ఇక తల నీలాలు మొదలు లడ్డూ ప్రసాదం, ప్రసాదం కవర్ల వరకు, దర్శనం టికెట్లు,ఆర్జిత సేవల టికెట్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం ఇంకెన్ని వందల వేల కోట్ల రూపాయలు ఉంటుందో ఆ వెంకన్నదేవునికే తెలియాలి.
అయితే, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అవసరాలకు మించిన ఆదాయం వస్తున్నా, ఇందుకు అదనంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశం అంతటా స్వామి వారి పేరున ఉన్న స్థిరాస్తులు, భూములు, పంట పొలాలు నుంచి వచ్చే ఆదాయం, బ్యాంకు డిపాజిట్స్ పై వచ్చే ఆదాయం, ఇతరత్రా అనేక మార్గాల్లో వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానము ( టీటీడీ) దాహం తీరడం లేదు.
అందుకే ఇప్పడు కొత్తగా, కొండపై ఉన్న వసతి గృహాలలో రూము రెంట్ ను ఏకంగా ఒకేసారి రెండు రెట్లు అంతకంటే ఎక్కువ పెంచారు. ఇంతవరకు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళ మాత వసతి గృహాల్లో రూ.500 నుంచి రూ.600 వరకు ఉన్న గది అద్దెను ఒక్కసారిగా రూ.1000కు పెంచేశారు. ఈ నెల 1 నుంచి నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1, 2, 3లో గదులను రూ.150 నుంచి జీఎస్టీతో కలిపి రూ.1700 చేశారు. నారాయణగిరి రెస్ట్ హౌస్ 4లో ఒక్కో గదిని రూ.750 నుంచి రూ.1700కు పెంచారు. కార్నర్ సూట్‌ను జీఎస్టీతో కలిపి రూ.2200కు పెంచారు. స్పెషల్ టైప్ కాటేజెస్‌లో రూ.750 ఉన్న గది అద్దెను జీఎస్టీతో కలిపి రూ.2800 చేశారు. భక్తులు గదుల అద్దెతో పాటు డిపాజిట్‌ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంది. దీంతో గదిని 1700కు పొందితే డిపాజిట్ నగదుతో కలిపి రూ.3400 చెల్లించాల్సి ఉంటుంది.
నిజానికి, ఇంతలా ఆదాయం వస్తున్నా కొండపై భక్తులకు కల్పించే సదుపాయాలు ఏమైనా మెరుగు పరిచారా అంటే అదీ లేదు. నిజానికి, హిందూ ధర్మ ప్రచారం,రాష్ట్రంలో, దేశంలో జీర్ణ ఆలాయాల పునరుద్ధరణ, హిందూ ధార్మిక కార్యకలాపాలు నిర్వహించడం టీటీడీ ప్రధాన కర్తవ్యం. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాబాయ్ ఎస్వీ సుబ్బారెడ్డి చైర్మన్ గానియమించిన పాలక మండలి, హిందూ ధర్మ ప్రచారం కంటే, అడ్డగోలుగా ఆదాయం పెంచుకునేందుకు, అన్యమత ప్రచారానికి ఎక్కవు ప్రాధాన్యత ఇస్తోందని, భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు ఎన్నో మార్లు ఆరోపించాయి, అయినా, టీటీడీ పట్టించుకోలేదు. ప్రభుత్వం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. వెంకన్న దేవుని ఆదాయాన్నే కాదు ఏకంగా ఆస్తులను మింగేసే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలున్నాయి.
నిజానికి అవేవీ ఆరోపణలు కాదు, దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఆస్తులను కాపాడ లేక పోతున్నామనే సాకుతో చెన్నై తదిర నగరాలలో ఉన్న అస్తుల అమ్మకానికి టీటీడీ గుట్టుచప్పుడు కాకుండా తీర్మానం చేసింది, అయితే, ఇంతలోనే ఆ నిర్వాకం బయటకు పొక్కడంతో, హిందూ సమాజం అప్రమత్తమై ఆందోళను దిగడంతో, టీటీడీ వెనకడుగు వేసింది. నిజానికి, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి, అయిన తర్వాత ఒక్క తిరుమలలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై ప్రత్యక్షంగా,పరోక్షంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి.గడచిన ముడున్నసంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వందల ఆలయాలను దుండగులు ద్వంసం చేశారు. అయినా ఇంతవరకు ఒక్కరి మీద అయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. మరో వంక ప్రభుత్వం అన్య మత ప్రచారకులు, పాస్టర్లకు నెల జీతాలు ఇచ్చి పోషిస్తోంది.
ఆ విషయాన్ని అలా ఉంచి, మరో మారు తిరుమల వసతి గదుల రెంట్ విషయానికి వస్తే, దేశంలో అత్యధిక ఆదాయం వచ్చే ఆలయాలలో తిరుమల మొదటి స్థానంలో ఉంటుంది.కానీ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క టీటీడీ మాత్రమే, వసతి వ్యాపారం చేస్తోంది. దేశంలోని ఇతర పుణ్య క్షేత్రాలలో ఉచిత సత్రాలు లేదా నామ మాత్రపు రుసుముతో ఆ మేరకు సదుపాయాలు కల్పించే వ్యవస్థలున్నాయే కానీ, ఇలా దొరికిన కాడికి దొరికినంత దోచుకునే దోపిడీ వ్యవస్థ, ఇంకెక్కడా లేదు. అందుకే టీటీడీ పుణ్యాన తిరుమమలో వసతి అనేది అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. కొండెక్కి కూర్చుంది. స్టార్ హోటళ్ల స్థాయిలో రూమ్ రెంట్లు పెంచేస్తున్నారు.
అందుకే సామాన్యులు తిరుమల వచ్చేందుకే భయపడే విధంగా టీటీడీ వ్యవహరిస్తోందని, సామాన్య భక్తులు వాపోతున్నారు. నిజానికి, ఒక్క గదుల విషయమే కాదు, టీటీడీ, జగన్ రెడ్డి ప్రభుత్వం సంయుక్తంగా తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా మార్చేందుకు కుట్రలకు పలపడుతోందని అంటే కాదనలేని విధంగా వ్యవహారాలు జరుగుతున్నాయి. అదే మంటే .. ఇదేమని అడుగేవారు లేరు. అదే టీటీడీ ధైర్యం. కానీ, ఎవరు అడిగినా అడగక పోయినా, సమయం వచినప్పుడు అడగవలసిన వారే అడుగుతారు. వడ్డీతో సహా వసూలు చేస్తారు .. ఓంనమో వేంకటేశాయ !