కారులో తిరుగుబాటు కారణం అదేనా?
posted on Jan 8, 2023 @ 6:50PM
తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.ముఖ్యంగా,భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లో అనూహ్య పరిణామాలు అతి వేగంగా చోటు చేసుకుంటున్నాయి. నిజానికి, పార్టీలో, ప్రగతి భవన్ లో ఏమి జరుగుతోందో ఎవరికీ స్పష్టంగా ఎవరికీ ఏమీ తెలియక పోయినా ఏదో జరిగిపోతోందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఓ వంక ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం, మరోవంక అడ్డం తిరిగిన, భారాస ఎమ్మెల్యేల బేరసారాల కేసు విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎప్పుడు ప్రగతి భవన్ తలుపులు తడుతుందో అర్థం కాని ఆందోళనకర పరిస్థితి. మరోవంక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో పార్టీలో రీసౌండ్ చేస్తున్న అసమ్మతి... ఈ అన్నిటినీ మించి, బీఆర్ఎస్ ముహూర్త బలం మీద వ్యక్త మవుతున్న అనుమానాలు. బీఆర్ఎస్ నాయకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు.
బీఆర్ఎస్ ముహూర్త బలం సంగతి ఎలా ఉన్నపటికీ పేరు మార్పుతో తెలంగాణ సెంటిమెంట్ చేజారి పోతోందనే అందోళన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిథులను వెంటాడుతోంది. మరోవంక పార్టీ భవిష్యత్ తో పాటుగా పార్టీలో తమ భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలోనే పార్టీలో అసంతృప్తి, అసమ్మతి మెల్లమెల్లగా బయటకొస్తున్నాయని అంటున్నారు. వీటన్నిటికీ తోడు ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న నేతలు.. సిట్టింగులకే సీట్లు అంటూ పార్టీ అధినాయకత్వం చేస్తున్న ప్రకటనలతో, పలువురు ఆశావహులు పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవంక, లీక్ అవుతున్న సర్వే రిపోర్టుల ప్రకారం పది మంది మంత్రులతో పాటుగా 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరని జరుగతున ప్రచారంతో పార్టీలో పక్క చూపులు చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపద్యంలో ఖమ్మం జిల్లాలో మొదలైన గులాబీ రివోల్ట్ ఇప్పుడు మెల్లమెల్లగా ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది.ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే తన అసంతృప్తిని బహిరంగంగానే బయట పెట్టారు.
మరోవంక ఆయన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి, పొంగులేటి కాషాయ ధారణకు ముహూర్తం వినా మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయని అంటున్నారు. అలాగే పొంగులేటి పార్టీ మారితే, ఆయనతో పాటుగా భద్రాద్రి జడ్పీ చైర్మన కోరం కనకయ్య, డీసీసీబీ మాజీ చైర్మన మువ్వా విజయ్‌బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మద్దినేని స్వర్ణకుమారి, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మట్టా దయానంద్, కోట రాంబాబు, తెల్లం వెంకటరావు, ఎస్సీ కార్పొరేషన మాజీ చైర్మన పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటకు చెందిన జారే ఆదినారయణ సహా పెద్ద సంఖ్యలోనే భారాస నాయకులు, కార్యకర్తలు బీజేపీ గూటికి చేరతారని అంటున్నారు. అందుకే పొంగులేటి పార్టీ మారడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన భారస నాయకత్వం ఆయన వెంట వెళ్ళేవారిని గుర్తించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెసుస్తోంది.
మరోవంక అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన భవిష్యత్ రాజకీయాలపై ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. తన ఆత్మీయులు నిర్వహిస్తున్న సమావేశాలతో బలాన్ని కూడగట్టుకుంటున్న ఆయన తన ప్రసంగాల్లో ఎక్కడా బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా మాట్లాడడంలేదు. కేసీఆర్ సహకారంతో చేసిన అభివృద్ధి చేశానని స్పష్టం చేస్తున్నారు. పాలేరు నుంచే పోటీకి సిద్ధంగా ఉన్న ఆయనకు బీఆర్‌ఎస్ ఏమేరకు ప్రాథాన్యమిస్తుందనేది అంతుపట్టడం లేదు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. బీఆర్‌ఎస్ పాలేరు అభ్యర్థిత్వం ఇస్తే సరే.. లేదంటే కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం లేకపోలేదని అంటున్నారు. తుమ్మల ప్రస్తుతానికి అయితే ఖచ్చితమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ఆయన నిర్ణయం తీసుకుంటే, ఆయనకు అనుకూలంగా ఉన్న వైరా మాజీ ఎమ్మెల్యే మదనలాల్ సహా వేర్వేరు నియోజక వర్గాలకు చెందిన అసంతృప్త నేతలు, వారి అనుచరులు ఆయన వెంట నడిచే అవకాశం ఉందని అంటున్నారు.
అలాగే, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కూడా త్వరలోనే కారు దిగడం ఖాయమంటున్నారు. నిజానికి, బయటకు వినిపిస్తున్న పేర్లు కొన్నే అయినా, భారాస నుంచి బయట పడేందుకు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా గులాబీ నేతలు పదుల సంఖ్యలో సిద్దంగా ఉన్నారని అంటున్నారు. అందుకే తెలంగాణ రాజకీయాలు ఎప్పడు ఏ మలుపు తిరుగుతాయో ...అంతు చిక్కడం లేదని అంటున్నారు.