తెరాసకు కాల్పుల సరదా జాడ్యమేమిటో?
posted on Aug 16, 2022 8:17AM
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీ సందర్భంగా మంత్రి శ్రీనివాస గౌడ్ గాలిలోకి కాల్పులు జరిపిన సంఘటన సృష్టించిన వివాదం సద్దుమణగక ముందే టీఆర్ఎస్వీ నాయకులు గన్ తో గాలిలో కాల్పులు జరిపిన సంఘటన సంచలనం రేపింది.
ఈ సంఘటన ఎప్పుడు జరిగిందనేది స్పష్టం కాకపోయినా.. టీఆర్ఎస్వీ నాయకుడు ఆ కాల్పుల దృశ్యాలను తమ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో వెలుగులోకి వచ్చింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిథిలోని మీర్ ఖాన్ పేట్ గెస్ట్ హౌస్ లో ఈ సంఘటన జరిగింది. టీఆర్ఎస్వీ నాయకులు విఘ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలు గాల్లోకి కాల్పులు జరిపి, వాటిని చిత్రీకరించి తమ వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నారు.
టీఆర్ఎస్ వీ నాయకులు అంతకు ముందు గెస్ట్ హౌస్ లో వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల సంఘటన ఎప్పుడు జరిగింద. వారు కాల్చింది ఎయిర్ గన్నా? ఒరిజినల్ గన్నా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదంతా అధికార పార్టీకి చెందిన ఓ నేత గెస్ట్ హౌస్ లో నిర్వహించిన బర్త్ డే వేడుకలో జరిగినట్టు పోలీసులు గుర్తించడమే కాకుండా, ఆ దిశగా ఆధారాలు సేకరించారు. కాగా శ్రీనివాసగౌడ్ గాలిలోకి కాల్పులు జరిపిన ఉదంతం సృష్టించిన వివాదం సద్దుమణగక ముందే అటువంటిదే మరో సంఘటన వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్ నేతలకు ఈ కాల్పుల సరదా జాడ్యమేమిటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుందన్న అహంకారమా అని ప్రశ్నిస్తున్నారు. కాల్సులు జరిపిన మంత్రి శ్రీనివాసగౌడ్ తో పాటు, టీఆర్ఎస్వీ నాయకులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.