ఏపీ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో జగన్, చంద్రబాబు
posted on Aug 16, 2022 8:23AM
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం ఏపీ రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, విపక్ష నేత చంద్రబాబు హాజరయ్యారు. గవర్నర్ బిశ్వభూషన్ ఇచ్చిన ఈ తేనీటి విందు కార్యక్రమానికి సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు. ఈ ఇరువురూ ఒకే కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత అరుదు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృతోత్సవ్ కమిటీ సమావేశానికి చంద్రబాబు హాజరైన కారణంగా జగన్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. అటువంటిది గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి ఇరువురూ హాజరు కావడం సర్వత్రా ఆసక్తి నింపింది.
అయితే ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జగన్, చంద్రబాబు పరస్పరం ఎదురు పడలేదు. ఒకరిని ఒకరు పలకరించుకోలేదు. కార్యక్రమంలో ఎవరికి కేటాయించిన టేబుల్స్ లో వారు కూర్చున్నారు. జగన్ దంపతులు గర్నవర్ దంపతులు కూర్చున్న టేబుల్ దగ్గరే కూర్చున్నారు. చంద్రబాబు కాస్త దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. కాగా, ఎట్ హోమ్ కార్యక్రమంలో చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని ఒకే టేబుల్ దగ్గర కూర్చోవడంపై తెలుగుదేశం శ్రేణుల్లో పెద్ద చర్చ జరిగింది
ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు బొకే ఇవ్వడానికి కూడా నాని నిరాకరించిన సంగతి విదితమే. కాగా ఈ కార్యక్రమానికి ఏపీ సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు గవర్నర్ హరిచందన్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరినీ గవర్నర్ స్వయంగా పలకరించారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఏపీ గవర్నర్ రాజ్ భవన్ లో తేనేటీ విందు ఏర్పాటు చేశారు. కాగా, రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉన్న జగన్, చంద్రబాబు ఎట్ హోమ్ కు హాజరవడం. మూడేళ్ల తర్వాత ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సర్వత్రా ఆసక్తి రేపింది.