హైదరాబాద్ ఎమ్మెల్సీగా వాణిదేవీ విజయం
posted on Mar 20, 2021 @ 5:05PM
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత ఉందన్న పరిస్థితుల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాన్ని సాధించింది. హైదరాబాద్ -రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తైంది. స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలిమినేషన్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి... తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుపై 11 వేల 703 ఓట్ల లీడ్ లో ఉన్నారు. చివరి ఎలిమినేషన్ కూడా పూర్తి కావడంతో వాణిదేవి విజయం సాధించారు.
సురభి వాణిదేవికి తొలి, రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి లక్షా 49 వేల 269 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు లక్షా 37 వేల 566 ఓట్లు వచ్చాయి. బుధవారం ప్రారంభమైన ఎన్నికల కౌంటింగ్ లో తొలి రౌండ్ నుంచి వాణిదేవి లీడ్ సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లను ఏడు రౌండ్లలో లెక్కించగా.. అన్ని రౌండ్లలోనూ బీజేపీ కంటే ఆమెకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే 50 శాతం ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యతలోనూ వాణిదేవికి ముందు నుంచి లీడ్ రాగా... హర్షవర్ధన్, చిన్నారెడ్డి ఎలిమినేషన్ లో మాత్రమే రామచంద్రారావుకు లీడ్ వచ్చింది. చివరి నాగేశ్వర్ ఎలిమినేషన్ లో మాత్రం వాణిదేవికి భారీగా ఓట్లు రావడంతో ఆమె విజయం ఖరారైంది.
హైదరాబాద్- రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎన్నికల్లో సురభి వాణిదేవి విజయం సాధించడంతో టీఆర్ఎస్ భవన్ లో సంబరాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంబరాల్లో పాల్గొన్నారు. పఠాకులు పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు.