పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా.. వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా..
posted on Mar 20, 2021 @ 4:01PM
అప్పుడెప్పుడో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా వచ్చిందని విన్నాం. ఆ తర్వాత అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌కు సైతం కొవిడ్ పాజిటివ్ వచ్చింది. లేటెస్ట్‌గా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా సోకింది. రెండు రోజుల క్రితమే వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్నారు పాక్ ప్రధాని. ఇంకా రెండో రోజు వేసుకోక ముందే ఇమ్రాన్ ఖాన్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది.
ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా వైరస్ సోకినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫైసల్ సుల్తాన్ వెల్లడించారు. ప్రధాని ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఏకంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కే కొవిడ్ సోకడం పాకిస్తాన్‌లో పాజిటివ్ కేసుల తీవ్రతకు నిదర్శనం.
పాకిస్తాన్‌లో పాజిటివిటీ రేటు 9.4 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 6,23,135 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 40 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 13,799కి పెరిగింది. ఇప్పటి వరకు 5,79,760 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఏకంగా దేశ ప్రధానికే కరోనా సోకడంతో పాక్ ప్రభుత్వ యంత్రాంగం మరింత అప్రమత్తమైంది.