మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా! తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు
posted on Dec 23, 2020 @ 10:58AM
తెలంగాణలో మరో ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా సోకింది. గత రెండు రోజుల నుంచి నీరసంగా ఉండడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. తన రిపోర్టులో పాజిటివ్‌గా తేలిందని ప్రకాష్ గౌడ్ చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తాను ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్నానని, కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయొద్దని తెలిపారు. తనను కలవటానికి కూడా ప్రయత్నాలు చేయవద్దని కోరారు ప్రకాష్ గౌడ్. దేవుడి ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని, మళ్లీ ప్రజల ముందుకు వస్తానని చెప్పారు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.
మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ సంఖ్య 2,82,982కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,74,833కు పెరిగాయి. కరోనాతో మంగళవారం మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 1522కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,627 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 4,467 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.