కుమ్ములాటల్లో తెలంగాణ కమలం ! ఎంపీ కామెంట్లతో కలకలం
posted on Dec 23, 2020 @ 10:39AM
ఆలు లేదు చూలు లేదు.. కాని కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లుగా తయారైంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కమలం పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. అదే జోష్ తో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించే దిశగా బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. పార్టీలోకి వలసలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ నేతలు మాత్రం గాడి తప్పుతున్నట్లు కనిపిస్తోంది. అత్మ విశ్వాసమే, అతి విశ్వాసమో తెలియుదు కాని.. కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ కమలంలో కాక రేపుతున్నారు. పార్టీ లైన్ తప్పి మరీ తమ ఇష్టమెచ్చిన ప్రకటనలు చేస్తున్నారు. తమకు అధికారం ఖాయమని చెప్పడమే కాదు.. పార్టీ నుంచి ముఖ్యమంత్రి ఎవరు అవుతారో కూడా చెప్పేస్తున్నారు కొందరు నేతలు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫలానే వ్యక్తే సీఎం అవుతారనే ప్రకటనలు ప్రాంతీయ పార్టీ నేతల నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడే సుప్రీమ్ కాబట్టి.. ఇలాంటి స్టేట్ మెంట్లతో ఎవరికీ పెద్ద ఇబ్బంది ఉండదు. నాయకులకు కొంత స్వేచ్ఛ ఎక్కువుండే కాంగ్రెస్ పార్టీలోనూ ఇలాంటి కామెంట్లు కామనే. కాని అత్యంత క్రమశిక్షణ గల సంస్థగా పేరున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలంతో పని చేసే భారతీయ జనతా పార్టీలో అలాంటి పరిస్థితులు ఉండవు. ఎన్నికలు పూర్తై పలితాలు వచ్చాక.. పార్టీ హైకమాండ్ ముఖ్యంగా ఆరెస్సెస్ ఆశీస్సులు ఉన్నవారికే పదవులు వస్తుంటాయి. ఇది ఇప్పటివరకు జరుగుతున్నది.. రాబోయే కాలంలో జరగబోయేది కూడా. కాని తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇందుకు విరుద్దంగా ప్రకటనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిపైనే సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్రస్తుతం కేంద్రమంత్రిగాఉన్న కిషన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. ఎంపీ సోయం బాపురావు చేసిన సీఎం ప్రకటన ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో కలకలం రేపుతోంది.
వరుస విజయాలతో దూకుడు మీదున్న తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కమలం గూటికి చేరేందుకు క్యూడుతున్నారు. అయితే తెలంగాణ బీజేపీకి వలసలతో పాటు వర్గపోరు పెరిగిపోతుందనే చర్చ జరుగుతోంది. కొంత కాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ చీఫ్ బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు సాగుతుందన్న ప్రచారం ఉంది. సంజయ్ కి పార్టీ పగ్గాలు వచ్చే వరకు తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డిదే హవా. బండి వచ్చాక పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంజయ్ దూకుడే పార్టీకి ప్లస్ అయిందనే భావన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో రోజు రోజుకు సంజయ్ గ్రాఫ్ పెరిగిపోతుండగా.. పార్టీలో కిషన్ రెడ్డి నామమాత్రంగా మారిపోతున్నారు. ఇది గ్రహించిన కిషన్ రెడ్డి కూడా దూకుడు పెంచారని చెబుతున్నారు. అందులో భాగంగానే సోయం బాపురావు ముఖ్యమంత్రి పోస్టుపై ప్రకటన చేశారనే చర్చ బీజేపీ కార్యాలయంలో జరుగుతోంది. కిషన్ రెడ్డి చొరవతో బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీ అయ్యారు సోయం. అందుకే కిషన్ రెడ్డిని లైవ్ లో ఉంచే లక్ష్యంతోనే ఆయన ఆ ప్రకటన చేశారని భావిస్తున్నారు.
తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరే కాదు.. క్యాస్ట్ కుమ్ములాటలు తీవ్రమయ్యాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్ పార్టీకి రాజీనామా చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. పాలమూరు జిల్లా బీజేపీలో ప్రస్తుతం మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పినట్లే జరుగుతుందట. బీసీ నేతలను వాళ్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. బండి సంజయ్ మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో అది బహిర్గతమైందని తెలుస్తోంది. తనను పట్టించుకోలేదనే మనస్తాపంతోనే.. బండి సంజయ్ జిల్లాలో ఉండగానే రాజీనామా చేసిన బీజేపీలో అలజడి రేపారు ఎర్ర శేఖర్. సంజయ్ బుజ్జగించడంతో ఆయన తిరిగి మనసు మార్చుకున్నా.. బీసీ, రెడ్డి నేతల మధ్య బీజేపీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయన్నది ఆ ఘటనతో బయటపడినట్లైంది. గ్రేటర్ హైదరాబాద్ లోని తార్నాకలో రెండు వర్గాలు నడిరోడ్డుపైనే కొట్టుకోవడం కమలం పార్టీలో వర్గపోరుకు అద్దం పట్టింది.
హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లానే కాదు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బీజేపీలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉందంటున్నారు. పాత నేతలు, కొత్త నేతలకు పొసగడం లేదట. సామాజిక వర్గాల వారీగా నేతలు గ్రూపులు కడుతున్నారని తెలుస్తోంది. వరుస విజయాలతో పార్టీ నేతల్లో కనిపిస్తున్న ఆత్మ విశ్వాసం, భారీగా వచ్చి చేరుతున్న వలస నేతలతో తమకు ప్రయోజనం ఉంటుందో లేక వర్గ విభేదాలతో అసలుకే మోసం వస్తుందో తెలియడం లేదని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారంటే .. ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి గురించి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు చేసిన ప్రకటనపై పార్టీ పెద్దలు ఆరా తీసినట్లు చెబుతున్నారు. సోయం వ్యాఖ్యలపై బండి సంజయ్ వర్గం గరంగరంగా ఉందని తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీని.. పార్టీలో జరుగుతున్న ఘటనలు పరేషాన్ చేస్తున్నాయని తెలుస్తోంది.