టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత.. కేసీఆర్ దిగ్భ్రాంతి
posted on Dec 1, 2020 @ 9:57AM
కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటనే నోములను హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నోముల నర్సింహయ్య మృతి చెందారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నేతగా నోముల నిలిచిపోతారన్నారు. నోముల మరణం టీఆర్ఎస్‌కు, నాగార్జున సాగర్ ప్రజలకు తీరని లోటని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
1999, 2004లో సీపీఎం తరపున నాగార్జున సాగర్ నుండి విజయం సాధించిన ఆయన 2013లో టీఆర్ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికలలో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2018 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి జానారెడ్డిపై నర్సింహయ్య ఘన విజయం సాధించారు.