ఆఖరి నిమిషంలో తలకిందులవుతున్న సమీకరణాలు.. నోటా లేదా టీఆరెఎస్ కు జై కొడుతున్న జనసేన
posted on Nov 30, 2020 @ 11:37PM
జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ముగిసి మరో కొన్ని గంటలలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక పక్క తమ సపోర్ట్ తో ఏపీలో అధికారం చేపట్టిన జగన్ నాయకత్వంలోని వైసిపి హైదరాబాద్ లో చివరి నిమిషంలో టిఆర్ఎస్ కు జై కొట్టాలని పిలుపిచ్చినట్లుగా వైసిపి గ్రూపులలో కొన్ని వాట్స్ ఆప్ మెసేజ్ లు సర్క్యులేట్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా హైదరాబాద్ మహానగర ఎన్నికలలో బిజేపీ కి మద్దతుగా జనసేన పార్టీ తరుఫున నామినేషన్ వేసిన అభ్యర్థులను కూడా చివరి నిమిషంలో ఉపసంహరించుకుని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం జనసేన కేడర్ కూడా బీజేపీకి బైబై చెప్పడానికి రెడీ అయిందని తెలుస్తోంది. ఈ ఎన్నికలలో తాము కూడా పోటీ చేయాలని మొదట భావించిన జనసేన నాయకులు నామినేషన్లు వేసిన తరువాత పవన్ ప్రకటనతో ఉసూరుమంటూ తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరోపక్క దుబ్బాక ఎన్నికలలో గెలుపుతో మంచి జోష్ మీదున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తమ నిర్లక్ష్య వైఖరితో జనసేన కేడర్ మద్దతు కూడగట్టడంలో మాత్రం వైఫల్యం చెందారని తెలుస్తోంది. ఇది బీజేపీ అవకాశాల పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో బిజెపి కార్యకర్తలతో పాటు జనసైనికుల సపోర్ట్ ఎక్కువగా కనిపించింది. అయితే ఒకసారి దుబ్బాకలో నెగ్గిన తర్వాత బండి సంజయ్ జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడిన తీరు జనసేన కు కోపం తెప్పించింది. మరోపక్క జనసేన పార్టీ కూడా జిహెచ్ఎంసి లోని 18 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టడం జరిగింది. అయితే కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్ వంటి అగ్ర నేతలు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయి జనసేన అభ్యర్థులు ను పోటీ నుండి విరమించుకునేలా చేశారు. అయితే రెండు పార్టీల మధ్య హైదరాబాదులో పూర్తీ స్థాయి మిత్రత్వం కనిపించలేదు. నిన్న జరిగిన అమిత్ షా రోడ్ షో సందర్భంగా బిజెపి జెండాలతో పాటు జనసేన జెండా లు కూడా ఎగురుతున్న సమయంలో జనసైనికులు తమ జెండాలను తీసివేయమని బండి సంజయ్ గదమాయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అయింది.
ఇదే సమయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో.. జనసేన ని పోటీ నుండి విరమించుకోమని బీజేపీ కోర లేదని, పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా తానే విరమించుకున్నారని వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ జనసేన నాయకులు తీవ్రంగా స్పందిస్తూ.. బిజెపి తరఫున కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు పవన్ తో భేటీ అయ్యారో చెప్పాలి అంటూ ఆయనని అటు బహిరంగంగాను ఇటు సోషల్ మీడియా వేదికగాను ప్రశ్నించారు. దీంతో ఎట్టకేలకు ఆయన జనసైనికులు మద్దతిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ రోడ్ షో చివరిలో వ్యాఖ్యానించారు. అయితే గత మూడు నాలుగు రోజుల్లో ఆయన జనసేనను చులకన చేస్తూ చేసిన రకరకాల వ్యాఖ్యలకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
మరోపక్క జనసేన పార్టీ అభిమానులకు టిఆర్ఎస్ పట్ల కొంత వ్యతిరేకత ఉన్న సంగతి తెల్సిందే. 2019 లో ఎపి ఎన్నికల సందర్భంలో తమ పార్టీలో చేర్చుకున్న ముఖ్యనేతలను టిఆర్ఎస్ పార్టీ బెదిరించింది అని, మీరు జనసేన లో చేరితే హైదరాబాదులో ఉన్న మీ ఆస్తులకు భద్రత ఉండదు అని భయపెట్టింది అని ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా వైసిపికి టిఆర్ఎస్ అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని, ఇలా రక రకాల కారణాలతో జన సైనికులకు టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. అయితే టిఆర్ఎస్ పట్ల వారిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ దానిని క్యాష్ చేసుకుని జనసేన కేడర్ ను బీజేపీ వైపు మలుచుకోవడంలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తమ మొండి వైఖరి తో విఫలమయ్యారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో పూర్తిగా సఖ్యత తో మెలిగితే, ఎన్నికల్లో గెలిచాక మళ్ళీ ఎక్కడ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుందో అని సందేహించి వారిని దూరం పెట్టినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అంతేకూండా పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి తమ పార్టీ అభ్యర్థులను బిజెపి పోటీ నుండి తప్పించింది అన్న భావన జనసైనికుల లో బలంగా ఉంది. పైగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి నేతలు తమను ఇంతగా రెచ్చగొడుతున్నా ఆ పార్టీకి , ఎందుకు ఓటు వెయ్యాలి అన్న భావన వారిలో బాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీలయితే టిఆర్ఎస్ కు లేదంటే నోటా కి కానీ వేయడం బెటర్ అన్న భావనలోకి జనసైనికులు వచ్చినట్లుగా సమాచారం. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో జనసైనికుల ప్రభావం తప్పకుండ పడే అవకాశం ఉంది. అది ఒక అభ్యర్థిని గెలిపించే అంత ప్రభావం వీరు చూపక పోవచ్చు కానీ, ఓట్లు చీల్చడం ద్వారా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో అయితే చాలా ప్రాంతాలలో ఉన్నట్లు గా తెలుస్తుంది. ఇదే సమయంలో దుబ్బాకలో అత్యంత క్లిష్టమైన పోటీలో వెయ్యి ఓట్లు, అంటే కేవలం ఒక శాతం కంటే తక్కువ మెజార్టీతో సీటు దక్కించుకున్న బీజేపీకి, ప్రతి ఒక్క ఓటు విలువ బాగానే తెలిసి ఉండాలి. మొత్తానికి రేపటి జిహెచ్ఎంసి ఎన్నికలలో జన సైనికులు బిజెపికి ఎంత వరకు ఓట్లు వేస్తారు అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.