అల్లు అర్జున్ టీఆర్ఎస్ కి ప్రచారం చేస్తాడా?
posted on Apr 9, 2014 @ 2:28PM
యంగ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల శేఖర్‌రెడ్డి ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన బుధవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నానని శేఖర్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా నిర్వహించారని, తాను కూడా ఉద్యమంలో పాల్గొనన్నానని ఆయన తెలిపారు.
ఇదంతా బాగానే వుందిగానీ, శేఖర్‌రెడ్డి అల్లుడు అల్లు అర్జున్ మామగారి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా అనే సందేహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. ఒక వర్గం అయితే అల్లు అర్జున్ మామగారి కోసం తప్పకుండా ప్రచారం చేస్తారని, అలా ప్రచారం చేయడం ద్వారా మామగారి గెలుపుకు దోహదపడినట్టు అవడంతోపాటు, తెలంగాణ ప్రజలకు అల్లు అర్జున్ మరింత చేరువ కావడానికి అవకాశం వుందని అంటున్నారు.
అలాగే మరో వర్గం అల్లు అర్జున్ ప్రచారం చేసే అవకాశమే లేదని చెబుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమంటూ ప్రచారం చేయడం వల్ల సీమాంధ్రుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం వుంది కాబట్టి రాజకీయాలకు, ప్రచారానికి దూరంగా వుండటం మంచిదని అల్లు అర్జున్ భావించొచ్చని ఊహిస్తున్నారు. మరోవైపు శేఖర్‌రెడ్డికి తన రాజకీయాల్లోకి అల్లుడిని లాగడం ఇష్టం లేదని అంటున్నారు. మరి అల్లు అర్జున్ ‘హోమ్ డిపార్ట్ మెంట్’ ఏమంటుందో.. ‘అల్లు’డుగారు ఏం చేస్తారో చూడాలి.