అపాయింటెడ్ డే విషయంలో టీఆర్ఎస్‌ది అరణ్యరోదన
posted on May 8, 2014 @ 3:52PM
రాష్ట్ర విభజన అపాయింటెడ్ డేని జూన్ 2 నుంచి మే 17వ తేదీకి మార్చాలని, తద్వారా టీఆర్ఎస్ పార్టీలో చీలిక వచ్చి, అధికారం నుంచి దూరమయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని టీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. హైదరాబాద్‌లో మొర పెట్టుకున్నా, ఢిల్లీలో మొరపెట్టుకున్నా సంబంధీకులందరూ డేట్ ముందుకు జరపడం మావల్ల కాదంటూ చేతులు ఎత్తేశారు. తెలంగాణ రాష్ట్రం మనుగడలోకి వచ్చే అపాయింటెడ్ డేను జూన్ 2 నుంచి ముందుకు జరపడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ వర్గాలు స్పష్టం చేశా యి. ఆలోపు విభజన పంపకాలు చేయడం కుదరదని వెల్లడించాయి. అపాయింటెడ్ డే నాటికి పంపకాలు ఒక కొలిక్కి వచ్చేలా లేవని, దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో త్వరగా ప్రభుత్వాల ఏర్పాటు, అపాయింటెడ్ డేను ముందుకు జరపడం సాధ్యం కాదని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జూన్ 2 వరకూ ఆపితే ఈ లోపు రాజ్యాంగ, రాజకీయ సమస్యలు ఎదురవుతాయని టీఆర్ఎస్ నాయకులు మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.