డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్‌ ఏసీపీ!

కంచె చేను మేస్తే అన్నట్లుగా ఏకంగా ఒక ట్రాఫిక్ ఏసీపీ మద్యం తాగి వాహనం నడుపుతూ  పట్టుబడ్డారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులను పట్టుకోవలసిన ట్రాఫిక్ పోలీసు అధికారే స్వయంగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెడితే.. 

హైదరాబాద్ లోని మధురా నగర్ లో  పోలీసులు బుధవారం (నవంబర్ 13) రాత్రి డ్రంక్ అండ్ర్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.   ఆ క్రమంలో   సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్  తప్పతాగి వాహనం నడుపుతూ వారికి చిక్కారు.  సివిల్ డ్రెస్సులో వాహనం నడుపుతూ వస్తున్నఆయనను పోలీసులు ఆపారు. బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. దానికి ఆయన సహకరించకుండా నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాను కూడా పోలీసు అధికారినేనంటూ వారిపై చిందులు తొక్కారు.  ఎంతకీ ఆయన బ్రీత్ ఎనలైజర్‌ ముందు ఊదకపోవడంతో   పోలీసులు సుమన్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు.