డ్రగ్స్ కేసులో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!
posted on Apr 9, 2021 @ 4:35PM
టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందాలో ఉన్నారని బెంగళూరు పోలీసులే తెలిపారన్నారు. తెలంగాణ పరువు తీసిన నలుగురు ఎమ్మెల్యే లను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు ల్యాండ్, శాండ్ , వైన్ డీల్ చేసే టీఆర్ఎస్ నేతలు.. డ్రగ్స్ దందా లో కూడా వేలు పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక లో బీజేపీ తో మాట్లాడుకొని కేసును మాఫీ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే బండి సంజయ్ .. కర్ణాటక లో చీకటి ఒప్పందాలు ఎలా చేసుకుంటారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.
అధికార మదంతో అక్రమాలతో టీఆర్ఎస్ దుష్ట పాలన సాగిస్తోందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. గిరిజనుల పోడు భూముల సమస్యలను చెప్పడానికి సీఎం కేసీఆర్ సభకు వస్తే గిరిజన మహిళలను కుక్కలతో పోల్చారని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు కళ్లు నెత్తికెక్కాయని, మంత్రి మల్లారెడ్డి బహిరంగంగా వసూల్ చేస్తున్నారు ఉత్తమ్ అన్నారు. ఆడియో లీక్ అయినా మంత్రి మల్లారెడ్డి ని ఎందుకు భర్తరఫ్ చేయడం లేదో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని, సాగర్ ఎన్నికల ను నిష్పక్షపాత జరిగే పరిస్థితి కనిపించడం లేదని ఉత్తమ్ అన్నారు. డబ్బు, మద్యం ఆపాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. టీఆర్ఎస్ , బీజేపీ మధ్య అండర్ స్టాండింగ్ ఉందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చడం కోసం బీజేపీ బలహీనమైన వ్యక్తి ని పెట్టిందని ఆరోపించారు. జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై సంగమేశ్వర లిఫ్టు కు సహకరిస్తున్నారని ధ్వజమెత్తారు.. రాయలసీమ కు నీళ్లు తరలిస్తే.. సాగర్ కు నీళ్లు రాకుండా పోతాయన్నారు. సాగర్ కు నీళ్లు రాకుండా చేస్తున్న కేసీఆర్ ఓటర్లు ఉప ఎన్నికలో తగిన బుద్ది చెప్పాలన్నారు.