కోర్టుకెళ్లే వాడికే వకీల్‌సాబ్ అంటే భయం..
posted on Apr 9, 2021 @ 3:53PM
పవన్ కల్యాణ్ అంటేనే కాదు, ఆయన సినిమాకు కూడా జగన్ భయపడుతున్నాడా? అంటూ ఏపీ బీజేపీ వ్యవహారాల సహా ఇంఛార్జి సునీల్ దేవధర్ ప్రశ్నించారు. ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి తిరుపతిలోని జయశ్యాం థియేటర్ దగ్గర నిరనస తెలిపారు. వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని సునీల్ దేవధర్ ప్రశ్నించారు. తిరుపతిలో పవన్ కల్యాణ్ కవాతు చేసినప్పుడే అసలు సినిమా రిలీజైందని అన్నారు.
అటు, ట్విట్టర్‌లోనూ ఆయన ఘాటుగా స్పందించారు. ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకునే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్ ను చూసి భయపడేది? అంటూ సెటైర్లు వేశారు సునీల్ దేవధర్.
ఓ సినిమా కోసం జాతీయ పార్టీ నాయకులు ఇలా నిరసన వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రజా సమస్యలేమీ లేనట్టు ఒక్క బెనిఫిట్ షో కోసం బీజేపీ శ్రేణులు ఇలా థియేటర్ల ముందు ధర్నా తెలపడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది బీజేపీ ఓవరాక్షన్ అంటూ వైసీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.