అధికారంలోకి వచ్చాకా ఎవరిని వదిలిపెట్టం! పోలీసులకు ఉత్తమ్ వార్నింగ్
posted on Jan 2, 2021 @ 12:05PM
సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ పతనం మొదలైందన్నారు. పోలీసులు కేసీఆర్‌ను చూసి ఎగరకండని.. జాగ్రత్తగా ఉండాలని.. తాము ఎవరిని వదిలిపెట్టబోమన్నారు. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని ఉత్తమ్ ఆరోపించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒత్తిడితోనే రాఘవ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. పోలీసులు చట్టం, ధర్మం, రాజ్యాంగం పరిధిలో పని చేయాలని సూచించారు.
జైలులో ఉన్న జంగా రాఘవరెడ్డిని కలిసేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క వస్తుండటంతో వరంగల్ సెంట్రల్ జైల్ వద్ద అధికారులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాఘవ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో వరంగల్ సెంట్రల్ జైలు పరిసరాలతో పాటు వరంగల్ నగరం, జనగామ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.