మంత్రి అవంతి ఎక్కడికి పారిపోయినా వదిలిపెట్టం: టీడీపీ సంచలన కామెంట్స్
posted on Jan 2, 2021 @ 10:58AM
ఏపీలోని విశాఖ నగరంలో గత కొంత కాలంగా వైసీపి, టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో చల్లని వింటర్ లో కూడా రాజకీయ వాతవరణం బాగా వేడెక్కుతోంది. తాజాగా జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ పై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విరుచుకుపడ్డారు. అవంతి ఇతర రాష్ట్రాలకు పారిపోయే రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా మరో రెండేళ్ల తర్వాత ఇటు రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు, అటు దేశంలో జగన్ కూడా ఉండడు అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఆఫర్ చేస్తున్న ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీలోనే ఉన్నారన్న అక్కసుతో వైసీపీ కక్ష్య సాధింపు చర్యలు చేపడుతోందని అయన మండిపడ్డారు. వెలగపూడి.. కబడ్ధార్ అని మంత్రి అవంతి అనడం హాస్యాస్పదంగా ఉందని అయన అన్నారు. అసలు అవంతి బెదిరింపులకి భీమిలి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలే భయపడరు, ఇంక ఆయన తాటాకు చప్పుళ్లకు టీడీపీ ఎమ్మెల్యే భయపడతారా? అంటూ మంతెన ఎద్దేవా చేశారు.
వైసీపీని నమ్మి రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇస్తే...రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ.. ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షలు, కార్పణ్యాలు, తప్పుడు కేసులతో రెండేళ్ళ సమయాన్ని వృధా చేసారని అయన విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రజలు వైసీపీని ఏపీ నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అయన హెచ్చరించారు. జగన్ ని నమ్మి రాష్ట్ర ప్రజలు మోసపోయినట్లు అవంతిని నమ్మి భీమిలి నియోజకవర్గ ప్రజలు కూడా మోసపోయారన్నారు. మంత్రి అవంతి విశాఖలో భూకబ్జాలు చేయడం తప్ప మంత్రిగా తన నియోజకవర్గానికి గానీ రాష్టానికి గానీ ఈ రెండేళ్లలో చేసిందేంటని అయన ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన మరుసటిరోజే విశాఖలో అవంతి చేసిన భూకబ్జాలపై చర్యలు తీసుకుంటామని, దీంతో చేసిన తప్పులకు భయపడి అవంతి.. ఇతర రాష్ట్రాలకు పారిపోయినా వదిలిపెట్టం అని మంతెన సత్యనారాయణరాజు హెచ్చిరించారు.