నాపై విష ప్రయోగం జరిగింది.. ఇస్రో ప్రముఖ శాస్త్రవేత్త సంచలన ప్రకటన
posted on Jan 6, 2021 @ 2:29PM
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా ఫేస్‌బుక్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని ఆయన ఫేస్‌బుక్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇంతకాలం గోప్యంగా ఉంచిన ఈ విషయాన్ని ఇప్పుడు బయటపెడుతున్నట్టు చెప్పారు.
2017 మే 23న ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనను చంపేందుకు కుట్ర జరిగిందని తెలిపారు. ఆరోజు తాను తీసుకున్న ఆహరంలో విషపూరిత రసాయనాన్ని కలిపారని పేర్కొన్నారు. ఈ కారణంగా తాను అనారోగ్యం పాలయ్యాయని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డానని, చర్మంపై దద్దుర్లు రావడంతో పాటూ అరచేతిపై చర్మం పెచ్చులుగా ఊడిపోయిందని చెప్పారు. తనపై ఆర్సెనిక్ అనే రసాయన ప్రయోగం జరిగినట్టు ఎయిమ్స్ రిపోర్టును కూడా తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో జత చేశారు.
గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని మిశ్రా అనుమానం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ రాడార్ ఆధారిత ప్రాజెక్టుకు సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్న తనను తొలగించడమే ఈ దాడి వెనుక కారణం అయి ఉండొచ్చని తెలిపారు. ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని, ఓ సహోద్యోగి కూడా దీనిపై ముందే అలర్ట్ చేశారని అన్నారు. అందువల్లే వైద్యులకు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విష ప్రయోగం జరిగిన రెండు, మూడు గంటల్లోనే తాను చనిపోయి ఉండేవాడినని తెలిపారు. ఈ చీకటి నిజాన్ని బహిర్గతం చేయవద్దంటూ ఇప్పటికీ తనకు వందలాది మెయిల్స్ వస్తున్నాయని అన్నారు. గతేడాది సెప్టెంబర్ లోనూ తనపై విష ప్రయోగం చేయాలని విఫలయత్నం చేసినట్లు తెలిపారు. గత కొన్నాళ్లుగా డైరెక్టర్లతో చర్చించినా ఫలితం లేదని, ఈ ఘటనపై ఇప్పటికైనా ప్రభుత్వం దర్యాప్తు జరపాలని మిశ్రా కోరారు. కాగా, స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన తపన్ మిశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.