మాటలు కాదు చేతల్లో చూపిస్తాం! కొడాలికి బాలయ్య కౌంటర్
posted on Jan 6, 2021 @ 2:43PM
ఆంధ్రప్రదేశ్ లోని హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు, జగన్ సర్కార్ తీరు, వైసీపీ నేతల ఆరోపణలపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. న్యాయం, చట్టంపై ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడితే తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయన్నారు బాలయ్య. నోరు అదుపులో పెట్టుకో ... మేం మాటల మనుషులం కాదు, అవసరమైతే చేతలు కూడా చూపిస్తామనిహెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని బాలయ్య స్పష్టం చేశారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన బాలకృష్ణ రైతుల సమస్యలు తెలుసుకున్నారు.
హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేయడం చాలా కిరాతకమన్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇలాంటి ఘటనలను ఖండించమేకాదు.. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి రథంపై మూడు వెండి సింహాలు మాయమైనా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అంతర్వేధిలో రథం దగ్ధం.. శ్రీరాముడు, సీత విగ్రహాల ధ్వంసం ఇలా చాలా జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఇచ్చారని, మరి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? అని బాలయ్య ప్రశ్నించారు. ఒకసారి మనమంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని.. ఇప్పటినుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.